కలం, వెబ్ డెస్క్: ఉజ్బెకిస్థాన్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ (PM Modi) ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్నారు. ‘ఒలియ్ దరజాలి దస్త్‌లిక్’ అవార్డును ఆ దేశ అధ్యక్షుడు శవ్‌కాత్ మిర్జియోయెవ్ ప్రధాని మెడలో వేసి శుభాకాంక్షలు తెలిపారు. భారత్–ఉజ్బెకిస్థాన్ దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ప్రధాని చేస్తున్న కృషికి గాను ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు మిర్జియోయెవ్ వెల్లడించారు. ఆయనకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఉజ్బెకిస్థాన్ అత్యున్నత అవార్డు పొందడం చాలా గర్వంగా ఉందన్నారు. ‘దస్త్‌లిక్’ పదం దోస్త్ అనే పదానికి చాలా దగ్గరగా ఉందని.. భారతీయులు తమ రోజువారీ జీవితాల్లో ఈ పదాన్ని వంద సార్లకు పైగా వాడుతుంటారని మోదీ వివరించారు. ఇది కేవలం తన ఒక్కడికి వచ్చిన గుర్తింపు కాదని, 1.4 బిలియన్ల భారతీయులకు వచ్చిన గుర్తింపుగా అభివర్ణించారు. ఇరు దేశాల మధ్య బంధం చాలా పురాతనమైందన్నారు.
ఆసియా సంక్షేమానికి..
భారత్ – ఉజ్బెకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయని ప్రధాని మోదీ అన్నారు. వ్యూహాత్మక రంగాలకు కూడా ఇది విస్తరించిందన్నారు. రెండు దేశాల మధ్య స్నేహాన్ని ఇక ముందు కూడా భారత్ కొనసాగించగలదని ప్రధాని స్పష్టం చేశారు. ఆసియా సంక్షేమానికి భారత్ ఎప్పుడూ తమ వంతు కృషి చేస్తూనే ఉంటుందని, మానవాళి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని మోదీ పేర్కొన్నారు.

