కలం, వెబ్ డెస్క్: యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ప్రధాన కొండపైకి భక్తులను చేరవేసే లిఫ్ట్ (Yadadri Temple Lift) పనిచేయడకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొండ పైకి వెళ్లేందుకు ఉన్న రెండు లిఫ్టులలో ఒకటి గత 10 రోజులుగా సాంకేతిక సమస్యల వల్ల పూర్తిగా పనిచేయడం లేదు. ఒక్క లిఫ్ట్ మాత్రమే పనిచేస్తుంది. అయితే అందుబాటులో ఉన్న ఒక్క లిఫ్టును కూడా వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలకు కేటాయిస్తున్నారు. దీనివల్ల ఆలయ ప్రాంగణంలో భక్తులు, ముఖ్యంగా వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాగా ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. లిఫ్ట్ పనిచేయకపోవడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారాంతాల్లో ఆలయానికి భక్తుల రద్దీ వేలాదిగా పెరుగుతుందని, ఆలయ అధికారులు స్పందించి, పాడైన రెండో లిఫ్టుకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని, సాధారణ భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

