కలం, కరీంనగర్ బ్యూరో: గత మూడేళ్లుగా వినతులు, విజ్ఞప్తులు, చర్చల ద్వారా ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం రాకపోవడంతో ఇక వినతులు ముగిశాయని, ఉద్యోగుల హక్కుల సాధనే లక్ష్యంగా పోరాటానికి సిద్ధమయ్యామని టీఎన్జీవోస్ కరీంనగర్ (Karimnagar) జిల్లా అధ్యక్షులు, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
రక్షణ లేని సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ (ఓపీఎస్) విధానాన్ని పునరుద్ధరించే (OPS Restoration) వరకు పోరాటం ఆపేది లేదని తేల్చిచెప్పారు. పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే భిక్షో, ఎక్స్-గ్రేషియా కాదు అని, అది ఉద్యోగికి వృద్ధాప్యంలో సామాజిక, ఆర్థిక భద్రతను ఇచ్చే ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు.
పెన్షన్ లేదు.. టెన్షన్ మాత్రమే!
2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి వృద్ధాప్య భద్రత లేకుండా పోయిందని, వారి భవిష్యత్తును మార్కెట్ హెచ్చుతగ్గుల ఆధారంగా మార్చడం శోచనీయమన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ఉద్యోగులకు పెన్షన్ లేక టెన్షన్ మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఉద్యోగుల ఆవేదనను, గోసను అర్థం చేసుకుని కన్నీళ్లను తుడవాలని విజ్ఞప్తి చేశారు. తమది రాజకీయ పోరాటం కాదని, హక్కుల పోరాటమని ఆయన తెలిపారు.
మూడు సంవత్సరాలుగా ముగియని ఎదురుచూపులు
2018 పీఆర్సీ కాలపరిమితి 2023తో ముగిసినప్పటికీ, కొత్త పీఆర్సీ కమిటీల నివేదికలు పత్రికల వార్తలకే పరిమితమవుతున్నాయని క్షేత్రస్థాయిలో అమలు ‘జీరో’ అని విమర్శించారు. నిత్యావసర ధరలు పెరుగుతున్న తరుణంలో పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని, మెరుగైన హెల్త్ కార్డ్ విధానాన్ని అమలు చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
మా సహనాన్ని చేతగానితనంగా చూడొద్దు!
రాష్ట్ర సాధనలో సకల జనుల సమ్మె, పెన్ డౌన్, వర్క్ టు రూల్, చాక్ డౌన్ వంటి చారిత్రాత్మక ఉద్యమాలు నడిపిన చరిత్ర తమదని, తమ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. ఉద్యోగులకు సమ్మెలు కొత్త కాదని, ప్రజలకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా తమ హక్కులు, కుటుంబ భవిష్యత్తు కోసమే ఈ పోరాటం అని వివరించారు. ఈసారి ‘డు ఆర్ డై’ ధోరణితోనే ముందుకెళ్తామని ప్రకటించారు.
సెప్టెంబర్ 8న కరీంనగర్లో సన్నాహక సమావేశం
సెప్టెంబర్ 1న నిర్వహించే “పెన్షన్ విద్రోహ దినం” నాడు ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వాలని, భోజన విరామ సమయంలో నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 10న నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సెప్టెంబర్ 8న సాయంత్రం 5 గంటలకు కరీంనగర్ టీఎన్జీవోస్ కమ్యూనిటీ హాల్లో ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు, టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ముజీబ్ హుస్సేన్ శ్యామ్ తో పాటు ఉమ్మడి జిల్లా నాయకులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరవుతారని తెలిపారు. ఈ మేరకు టీజీఓ జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాళీచరణ్ గౌడ్, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, అడ్ల అరవింద్ రెడ్డి, ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, సర్దార్ హరిమిందర్ సింగ్, రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్ రెడ్డి, మహిళా ఉద్యోగుల జిల్లా చైర్మన్ శారద, సునీత, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ నాయకులు కోట రామస్వామి, శంకర్, రాజేష్ భరద్వాజ్, సుమంత్రావు, వాస్తవిక్ గౌడ్, శ్రీమాన్ రెడ్డి, పోలు కిషన్, సత్యనారాయణ, నరేష్ తదితరులు ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశారు.

