కలం, వెబ్‌డెస్క్: వరదలతో అతలాకుతలమైన నేపాల్‌కు భారత్ (India – Nepal) మానవతా సాయాన్ని మరింత ముమ్మరం చేసింది. తాజాగా నాలుగో విడత సాయాన్ని పంపింది. 11 టన్నుల సహాయక సామగ్రి, టన్నెల్ రెస్క్యూ నిపుణులు, డీఎన్ఏ విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ నిపుణులు, దుప్పట్లు, హైజీన్ కిట్లతో కూడిన నాలుగో విమానం ఖాట్మాండుకు చేరుకున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఇప్పటి వరకు మొత్తం 68.5 టన్నుల సహాయక సామగ్రిని నేపాల్‌కు పంపినట్లు ఆయన తెలిపారు. అలాగే 230 అడుగుల సింగిల్ లేన్ మోడ్యులర్ స్టీల్ బ్రిడ్జ్ కోసం 16 ట్రక్కుల సామగ్రి ఇప్పటికే అక్కడికి చేరుకుందన్నారు. త్వరలోనే మరిన్ని బెయిలీ బ్రిడ్జిల పరికరాలు, సాంకేతిక బృందాలు వెళ్లనున్నాయని తెలిపారు. నేపాల్‌కు భారత్ తరఫున సహాయక చర్యలు కొనసాగుతాయని జైశంకర్ స్పష్టం చేశారు.

