కలం, తెలంగాణ బ్యూరో: త్వరలో తెలంగాణ మంత్రివర్గ (Telangana Cabinet) పునర్వ్యవస్థీకరణ ఉంటుందా?.. రెండు ఖాళీ స్థానాల భర్తీ కూడా ఉంటుందా?.. కొండా సురేఖ సంక్షోభం ఆ రూపంలో పరిష్కారమవుతుందా?.. ఇలాంటి ప్రశ్నలకు పీసీసీ చీఫ్, శాసనమండలి చైర్మన్ దాదాపుగా ఒకే తరహా కామెంట్లు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు అవుతున్నందున మంత్రులను, వారి శాఖలను మార్చి కొత్తదనాన్ని తీసుకురావడం మంచిదని ఇద్దరూ వేర్వేరు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌లో తలెత్తిన సంక్షోభ ప్రభావం ప్రభుత్వంపైనా పడుతున్నదంటూ ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఇటీవల తలెత్తిన వివాదంలో మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించాలని పలువురు ప్రజా ప్రతినిధులు వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేవలం ఆ చర్యకే పరిమితం కాకుండా, మొత్తం రీషఫ్లింగ్‌లో భాగంగా ఆమెతో పాటు మరికొందరికి ఉద్వాసన పలకడం డిప్లొమాటిక్‌గా ఉంటుందనేది పార్టీలోని మరికొందరి అభిప్రాయం. ఊహకు అందని తీరులో ఒక్క రోజు వ్యవధిలోనే అటు పీసీసీ చీఫ్, ఇటు శాసనమండలి చైర్మన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సొంత అభిప్రాయాలు వెల్లడించడం చర్చనీయాంశమైంది.
మొత్తం పునర్వ్యవస్థీకరించాలి
“మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న రెండు బెర్తుల్ని మాత్రమే భర్తీ చేస్తారా?.. లేక మొత్తంగానే రీవ్యాంప్ చేస్తారా?.. అనేది సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మొత్తంగా పునర్వ్యవస్థీకరణ చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. ముఖ్యమంత్రిగానీ లేదా ఏఐసీసీగానీ నా అభిప్రాయాన్ని అడిగితే అదే చెప్తా.’’
– పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
అయితేనే కొత్తదనం
“కాంగ్రెస్ పార్టీలో కొందరు లైన్ దాటి మాట్లాడుతున్నారు. గ్రూపు తగాదాలు ఎక్కువయ్యాయి. అధిష్టానం వేటు వేయకపోతే పార్టీకే నష్టం. ఇలా కంట్రోల్ చేస్తేనే మరోసారి అధికారంలోకి రావచ్చు. కేబినెట్‌లోనూ మార్పు రావాలి. ఇప్పుడున్న కేబినెట్‌ను షఫ్లింగ్ చేయాలి. అయితేనే కొత్తదనం వస్తుంది. రేవంత్‌రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు. ఆయనకు ఆటంకాలు సృష్టించకూడదు, పని చేయనివ్వాలి.”
– శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
రాష్ట్ర కేబినెట్ రీసెట్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేండ్ల టైమ్ ఉండటంతో మంత్రివర్గంలో కీలక మార్పులు చేర్పులు చోటుచేసుకోవడం ఖాయమని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం చక్కర్లు కొడుతున్నది. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన కామెంట్లు ఇందుకు ఊతమిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల తర్వాత పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు తప్పవని.. కొందరు కొత్తవారికి కూడా అవకాశం కల్పించొచ్చన్న వాదన వినిపిస్తున్నది.
మొత్తం పునర్వ్యవస్థీకరించాలి: పీసీసీ చీఫ్
“మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న రెండు బెర్తుల్ని మాత్రమే భర్తీ చేస్తారా?.. లేక మొత్తంగానే రీవ్యాంప్ చేస్తారా?.. అనేది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మొత్తంగా పునర్వ్యవస్థీకరణ చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం” అని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఓ ప్రైవేటు టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించారు. ఇప్పటికే మంత్రివర్గం ఏర్పడి రెండున్నరేండ్లయిందని, సాధారణ ప్రాక్టీస్ కూడా రెండున్నరేండ్ల తర్వాత మార్పులు చేయడంగానే ఉంటుందని, చేస్తే మంచిదనేదే తాను ఫీల్ అవుతున్నానని చెప్పారు. అయితే ముఖ్యమంత్రిగానీ లేదా ఏఐసీసీగానీ అభిప్రాయాన్ని అడిగితే తాను అదే చెప్తానని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, పార్టీ అధిష్టానం నిజంగా మొత్తం మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని, మంత్రుల పోర్ట్ఫోలియోలను మార్చాలని అనుకుంటే ఏం ఇబ్బందులు వస్తాయంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. ప్రస్తుతం పార్టీలో నెలకొన్న రాజకీయ వాతావరణంతో మంత్రివర్గాన్ని టోటల్‌గా రీవ్యాంప్ చేయడమే మంచిదని ఆయన భావిస్తున్నారు.
రీషఫ్లింగ్‌తో కొత్తదనం: మండలి చైర్మన్
“కాంగ్రెస్ పార్టీలో కొందరు లైన్ దాటి మాట్లాడుతున్నారు. పార్టీలో క్రమశిక్షణ లేదు. గ్రూపు తగాదాలు ఎక్కువయ్యాయి. అధిష్టానం వేటు వేయకపోతే పార్టీకే నష్టం. ఇలా కంట్రోల్ చేస్తేనే మరోసారి అధికారంలోకి రావచ్చు. కేబినెట్‌లోనూ మార్పు రావాలి. ఇప్పుడున్న కేబినెట్‌ను షఫ్లింగ్ చేయాలి. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలయింది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేస్తే కొత్తదనం వస్తుంది. ప్రభుత్వంలో మార్పు వస్తుంది. రేవంత్‌రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు. ఆయనకు ఆటంకాలు సృష్టించకూడదు, పని చేయనివ్వాలి…” అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీడియాతో శనివారం చిట్‌చాట్ సందర్భంగా పలు సంక్షేమ పథకాల అమలు, వాటికి చేయాల్సిన మార్పులు, విపక్షాలు చేస్తున్న విమర్శలు.. వీటిపైనా తన అభిప్రాయాలను ఆయన వెల్లడించారు. అటు పార్టీలో అంతర్గత సంక్షోభం, ఇటు మంత్రివర్గంలో చేయాల్సిన మార్పులపై చైర్మన్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేయడంతో త్వరలో మంత్రివర్గంలో సమూల మార్పులు తప్పవేమోననే అభిప్రాయం కలుగుతున్నది.
ఇద్దరి కామెంట్ల ‘టైమింగ్’తో గ్రౌండ్ వర్క్
– అటు పీసీసీ చీఫ్, ఇటు మండలి చైర్మన్ చేసిన కామెంట్ల ‘టైమింగ్’ మంత్రివర్గంలో త్వరలో మార్పులు తప్పవనే సంకేతం ఇస్తున్నది. వీరిద్దరి మాటలు ఒకదానితో ఒకటి సంబంధం లేని వేదికలే అయినా సరిగ్గా ఇప్పుడు పార్టీలో నెలకొన్న పొలిటికల్ హీట్ సమయంలో వెలుగులోకి రావడం గమనార్హం.
– చాలాకాలంగా మంత్రివర్గంలో రెండు ఖాళీ పోస్టుల భర్తీ అంటూ రకరకాల చర్చలు జరిగాయి. ఆశావహులు సైతం ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిశారు. అవకాశం కల్పించాలని కోరారు.
– కానీ, రెండు స్థానాలకు దాదాపు డజను మంది నుంచి పోటీ ఉండడంతో అటు సీఎం, ఇటు పార్టీ హైకమాండ్ తాత్కాలికంగా పక్కకు పెట్టింది.
– ఒకే అంశంపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడడంతో త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమవుతుందనే ఊహాగానాలకు తావిచ్చినట్లయింది.
– రెండున్నరేండ్ల పనితీరుపై స్పష్టమైన వివరాలు సీఎం దగ్గర ఉండడంతో ఎవరి శాఖలు మారుతాయి.. ఎవరికి ఉద్వాసన తప్పదు.. కొత్తగా వచ్చేవారెవరు?.. ఇలాంటివి ఆసక్తికరంగా మారాయి. సీఎం, పీసీసీ చీఫ్ ఢిల్లీ టూర్ తర్వాత మరింత క్లారిటీ రానున్నది.

