కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం ( Bhadradri Kothagudem) జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆవుల అక్రమ రవాణాను అడ్డుకుంటున్నాడనే నెపంతో వార్డు మెంబర్ మౌలానా అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన ఇస్మాయిల్ స్కార్పియో కారుతో బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మౌలానాను చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. మౌలానా మృతి వార్త తెలియడంతో ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
ఆగ్రహించిన మౌలానా బంధువులు నిందితుడైన ఇస్మాయిల్ ఇంటిపై దాడి చేసి, ఇంటికి నిప్పంటించారు. దీంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. నిందితుడైన ఇస్మాయిల్‌పై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఉద్దేశపూర్వకంగానే మౌలానాను కారుతో ఢీకొట్టి హత్య చేశాడని, అతడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మౌలానా బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.

