కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: తెలంగాణలో క్రాప్ హాలిడే ఇచ్చి ఆంధ్రాలో క్రాప్ ఫెస్టివల్లకు అవకాశం కల్పిస్తున్న మన పాలకులను నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సాగునీటి రంగంలో జరుగుతున్న జల దోపిడిని అరికట్టేందుకే ఎంతోకాలంగా పోరాడి సాధించుకున్న తెలంగాణ మన పాలకుల పుణ్యమా అంటూ అన్యాయమై పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు నుండి ఇప్పటివరకు 70 టీఎంసీల నీటిని అక్రమంగా దోచేశారని ఆయన విమర్శించారు. పోతిరెడ్డిపాడు ద్వారా అధికారం గంగా 36 టీఎంసీల నీటిని ఆంధ్ర వాడుకునే అధికారం, ఉన్న రెట్టింపు టీఎంసీల నీటిని తోడేశారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ఆరోపించారు.
కేవలం వరద జలాలను మాత్రమే తోడాల్సిన ఆంధ్ర అధికారులు అక్రమంగా నిలువ జలాలను తోడేస్తున్నారని ఆయన విమర్శించారు. అలాగే ఈనెల 31న వలిగొండ రిజర్వాయర్ గేట్లను ఎత్తేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ గేట్లు ఎత్తడానికి వీలు లేదంటూ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలకు అక్కడి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుంటే తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గం అన్నారు. తుంగభద్రా నదిలో ప్రస్తుతం 53 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, మహబూబ్‌నగర్ జిల్లా ప్రయోజనాల కోసం 15 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉన్నా.. నేటికీ కనీసం ఇండెంట్ కూడా పెట్టలేదని ఆయన విమర్శించారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా 60 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్లు ఉన్న నింపుకోలేని దుస్థితి ప్రస్తుత ప్రభుత్వం కల్పించిందన్నారు. గత మూడేళ్లుగా పరిపాలనలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇలాంటి ప్రభుత్వాన్ని నమ్ముకుని ఓట్లేసిన ప్రజలు ప్రస్తుతం పశ్చాత్తాప పడుతున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్దుబాట్లపైనే శ్రద్ధ పెట్టిందని, ప్రజల సర్దుబాటుకు వారికి తీరిక లేకుండా పోయిందన్నారు.
ఆల్మట్టి ప్రాజెక్టు భూసేకరణకు లక్ష కోట్లు
ఆల్మట్టి ప్రాజెక్టు (Almatti Project) 5 మీటర్ల ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైందని, ఈ మేరకు భూసేకరణకు క్యాబినెట్ ఆమోదం సైతం తెలిపిందన్నారు. ఆల్మట్టి డ్యాం ఐదు మీటర్లు పెంచితే భూములు పోయే రైతులకు పరిహారం చెల్లించేందుకు లక్ష కోట్లు ఇవ్వడానికి అక్కడి ప్రభుత్వం సిద్ధమైందన్నారు.
ఇక్కడి ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను సైతం పూర్తి చేయడానికి శ్రద్ధ వహించడం లేదని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ప్రభుత్వ విధానాలు మార్చుకోలేని పక్షంలో ప్రజలంతా పార్టీలకతీతంగా ముందుకు వచ్చి మరో ఉద్యమం చేయడానికి సైతం వెనకాడరని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నర్సింలు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : పాలమూరుకు ‘బ్రహ్మాస్త్రం’.. రూ 500 కోట్లతో 416 ఎకరాల్లో ఏర్పాటు
Follow Us On : WhatsApp

