కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బోర్గాం(పి)లోని జడ్పీ హైస్కూల్‌ను (Borgaon ZP High School) జిల్లా కలెక్టర్ (Nizamabad Collector) భవేష్ మిశ్రా (Bhavesh Mishra) శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, అందుబాటులో ఉన్న బోధనా సిబ్బంది, విద్యా బోధన తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని ఇతర ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే బోర్గాం జడ్పీ హైస్కూల్‌లో అత్యధికంగా 1,120 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలుసుకున్న కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా పాఠశాలలో పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులకు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.
క్రీడా మైదానం కోసం స్థల పరిశీలన
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలలో క్రీడా మైదానం లేదని పాఠశాల నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాఠశాలకు ఆనుకుని ఉన్న ఆరోగ్య ఉపకేంద్రం, గ్రంథాలయ భవనాలను కలెక్టర్ పరిశీలించారు. వాటిని సమీపంలోని మరో ప్రాంతానికి తరలించే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ భవనాలను మరోచోటికి తరలిస్తే పాఠశాలకు క్రీడా మైదానం ఏర్పాటు చేయడంతో పాటు అదనపు తరగతి గదుల నిర్మాణానికి కూడా అవకాశం ఉంటుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. అలాగే పాఠశాలకు ఆనుకుని ఉన్న ప్రైవేట్ స్థలాన్ని కొంతమేర సేకరించి పాఠశాలను మరింత విస్తరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించిన కలెక్టర్
ఈ సందర్భంగా కలెక్టర్ పదో తరగతి గదిని సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులను స్వయంగా బోధిస్తూ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులకు పెన్నులను బహుమతిగా అందజేశారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. విద్యార్థులను కేవలం పాఠ్యాంశాలకే పరిమితం చేయకుండా బయటి ప్రపంచానికి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని కూడా అందించాలని ఉపాధ్యాయులకు హితవు పలికారు.
పోటీ ప్రపంచంలో రాణించాలి
విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకుని ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు తమ ప్రతిభను నిరంతరం మెరుగుపర్చుకోవాలని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో కలెక్టర్ మొక్క నాటారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖ అధికారి పి. అశోక్, మోపాల్ తహసీల్దార్ రేఖ, ఎంఈఓ సాయిలు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్ తదితరులు ఉన్నారు.

