ఖర్గే వివాదం.. రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్!

కలం, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సభ ముగిసిన తర్వాత ఆ ప్రాంగణంలో ‘శుద్ధీకరణ’ కార్యక్రమం నిర్వహించడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

దేశంలో ప్రస్తుతం రెండు భావజాలాల నడుమ పోరాటం సాగుతోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఒకవైపు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వంటి మహానీయులు అందించిన రాజ్యాంగ భావజాలం ఉంటే, మరొకవైపు బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ల భావజాలం ఉందని వ్యాఖ్యానించారు. భారత్‌లో నేడు సాగుతున్న రాజకీయాలు ఈ రెండింటి మధ్యే నడుస్తున్నాయని స్పష్టం చేశారు.

వేల సంవత్సరాలుగా ఈ దేశంలో దళితులు వేధింపులు, హింసకు గురవుతున్నారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం అస్పృశ్యత నేరమైనప్పటికీ, నేటికీ పాఠశాలల్లో దళిత పిల్లలతో మరుగుదొడ్లు కడిగించడం, ఊడ్పించడం వంటి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఒక పక్క కొందరు పిల్లలు చదువుకుంటుంటే, తమ తోటివారు మాత్రం శుభ్రం చేయడం చూసి భావి తరాల మనస్సులపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఆలోచించాలని కోరారు.

ఉత్తరాఖండ్‌లో జరిగిన శుద్ధీకరణ ఘటన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద తీవ్రమైన నేరమని రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. అస్పృశ్యతను పాటించడమే శుద్ధీకరణ అని, ఇది స్పష్టమైన చట్ట ఉల్లంఘన అని అన్నారు. తాము అందరి ప్రధానమంత్రినని చెప్పుకునే నరేంద్ర మోదీ, ఈ ఘటనను సమర్థించిన వారిపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఖర్గేకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ విషయమై పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో తాను చర్చించానని తెలిపారు. దేశంలో ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఇక సాధారణ నాలుగు సంవత్సరాల దళిత చిన్నారి పరిస్థితి ఏంటని రాహుల్ ప్రశ్నించారు. ఖర్గేకు జరిగిన అన్యాయం దేశంలోని ప్రతి దళితుడికి, మహిళకు సంబంధించిన అంశమని అన్నారు.

తమ అధ్యక్షుడికి న్యాయం జరిగే వరకు పోరాడాలని నిర్ణయించుకున్నామని, ఇప్పుడు బంతి కేంద్ర ప్రభుత్వ కోర్టులోనే ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా తగిన ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. ప్రధానమంత్రి మౌనం వహించినా లేదా చర్యలు తీసుకోకపోయినా అది వారి భావజాలానికే నిదర్శనమని, దీనిపై ఇతరుల వ్యాఖ్యలతో తమకు పనిలేదని తేల్చిచెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>