కలం, ఖమ్మం బ్యూరో: రాబోయే గోదావరి నది పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా శనివారం భద్రాచలం (Bhadrachalam) వద్ద రూ. 46.65 కోట్ల భారీ అంచనా వ్యయంతో నూతన స్నాన ఘట్టాలు, పుష్కర ఘాట్ల (Godavari Pushkar Ghat) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు (MLA Tellam Venkata Rao) , జిల్లా కలెక్టర్ అంకిత్, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఈ పనులను అధికారికంగా ప్రారంభించారు. పుష్కరాల వేళ దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలానికి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రాజెక్టు పనులన్నింటినీ వేగవంతం చేస్తున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మరోవైపు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాభివృద్ధి మొదటి విడత పనులను సుమారు రూ. 350 కోట్ల అంచనా వ్యయంతో వేగంగా చేపడుతున్నారు. ఆలయ ప్రాంగణంలో ఇప్పటికే కూల్చివేత పనులు పూర్తయి కాంక్రీట్ నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. అలాగే భక్తుల రాకపోకలకు, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా రహదారుల విస్తరణను ప్రాధాన్యతతో చేపడుతున్నారు.
బ్రిడ్జ్ పాయింట్ నుంచి సుమారు 1.5 కిలోమీటర్ల మేర ఉన్న సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మారుస్తుండగా, కరకట్ట రహదారి విస్తరణను కూడా అందులోనే భాగం చేశారు. పట్టణంలోకి నేరుగా వాహనాలు వచ్చి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రింగ్ రోడ్డు కింద వైపు సర్వీస్ రోడ్లను అభివృద్ధి పరచడంతో పాటు, పర్ణశాల వైపు వెళ్లే మార్గాల్లోనూ సర్వీస్ రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు.
ఆర్ అండ్ బి శాఖతో సమన్వయం చేసుకుంటూ రోడ్డు రవాణా, తాగునీరు, బాత్రూమ్లు వంటి ప్రాథమిక సౌకర్యాల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పనుల పురోగతిలో ఎలాంటి ఆలస్యం జరగకుండా కలెక్టర్, చీఫ్ ఇంజనీర్ తదితర ముఖ్య అధికారులతో ప్రత్యేక కమ్యూనికేషన్ వాట్సాప్ గ్రూప్లను ఏర్పాటు చేసుకుని ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారు. కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో వ్యవహరించి నిర్ణీత గడువులోనే పనులన్నీ పూర్తి చేయాలని, భద్రాచల దివ్యక్షేత్రాన్ని మరింత సుందరంగా, ఆధ్యాత్మిక శోభతో తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

