కలం, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల (Sircilla)లోని చేనేత కళాకారులు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చేనేత సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నూలు పౌర్ణమి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి పాల్గొన్నారు. బస్టాండ్ దగ్గర ఉన్న నేత కార్మికుడికి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆధ్యాత్మికత, సంప్రదాయం, చేనేత సంస్కృతి కలగలిసిన నూలు పౌర్ణమి పండుగ చేనేత కార్మికులు, పద్మశాలీ సమాజానికి ఎంతో విశిష్టమైందన్నారు.
భక్త మార్కండేయ స్వామి ఆశీస్సులతో పద్మశాలీలు ఈ రోజు జంజనం వేసుకుంటారని మంత్రి పొన్నం వివరించారు. పట్టణ పద్మశాలీ సంఘాల ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ, భక్తి కార్యక్రమాలు, శోభాయాత్రలు నిర్వహిస్తూ భక్త మార్కండేయ స్వామిని స్మరించుకుంటారని పేర్కొన్నారు. చేనేత ప్రాధాన్యాన్ని గుర్తించామని, నేత కార్మికులు నేసిన వస్త్రాలను ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉపయోగించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

