కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి (Sangareddy Roads) జిల్లాలో గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా రోడ్లు గుంతలమయంగా మారాయి. ఏళ్ల తరబడిగా కనీస నిర్వహణ, మరమ్మతులు లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి నిత్య ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. జిల్లావ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రోడ్లపై ప్రయాణం చేయాలంటేనే వాహనదారుల గుండెల్లో గుబులు రేపుతోంది.
ఎటు చూసినా గుంతల రోడ్లే
ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా చాలా రోడ్లు దెబ్బతిన్నాయి. తారు రోడ్లు కొట్టుకుపోయి, అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. రోడ్లపై ప్రయాణం వాహనదారులకు నరకప్రాయంగా మారి చుక్కలు కనిపిస్తున్నా యి. గ్రామాల్లో రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు పోలేని దుస్థితి నెలకొంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, పొలాలకు వెళ్లే రైతులు ప్రతిరోజూ గతుకుల రోడ్లపైన జారిపడుతూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో కాలనీల అంతర్గత రోడ్ల నుంచి ప్రధాన రోడ్ల వరకు అధ్వానంగా మారా యి. రోడ్లపైన గుంతల కారణం గా వాహనాలు నెమ్మదించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతల్లో నీరు చేరి లోతు తెలియక వాహనదారులకు ప్రమాదాలకు గురువుతున్నారు. గుంతల రోడ్లపై ప్రయాణించడంతో నడుము, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు పెరుగుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డెక్కి జనాల ఆందోళనలు
- రాష్ట్ర వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిథ్యం వహిస్తున్న ఆందోల్ నియోజకవర్గంలోనూ రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది.
నాందేడ్ హైవే నుంచి పుల్కల్ మండల కేంద్రం మీదుగా సింగూరు ప్రాజెక్టుకు వెళ్లే గ్రామాల్లో కిలోమీటర్ల మేర రోడ్లు గుంతలమయంగా మారి వాహనదారులను, - స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. బైక్‌లు, కార్లు పడిపోయి ఎంతోమందికి ఫ్యాక్చర్లు, గాయాలయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా. రోడ్లపై గుంతలతో గొంగ్లూరు గ్రామస్తులు నిరసన కూడా తెలిపారు.
- జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని పలు కాలనీలలో రోడ్ల పరిస్థితి ఘోరంగా మారింది. మున్సిపాలిటి పరిధిలో ఎక్కడ చూసినా గుంతల రోడ్లే కనిపిస్తున్నాయి.
12వ వార్డు బృందావన్ కాలనీ పరిధిలో అధ్వానంగా తయారైన రోడ్లతో కాలనీవాసులు తమ కుటుంబాలతో రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. - పారిశ్రామిక, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే పటాన్‌చెరుతో పరిధిలోనూ రోడ్లు దారుణంగా మారాయి. నిత్యం వేలాది లారీలు, భారీ వాహనాలు తిరిగే ప్రాంతాల్లో రోడ్ల ఉపరితలం కొట్టుకుపోయి రాళ్లు తేలిపడ్డాయి.
- అమీన్ పూర్ పరిధిలోని బంధం కొమ్ము ప్రాంతంలో రోడ్లపై వేలాది మంది ప్రయాణిస్తుండగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పటాన్ చెరువులో చాలా ప్రాంతాల్లో ప్రధాన రోడ్ల నుంచి కాలనీల అంతర్గత రోడ్ల వరకు అన్నీ గుంతలమయంగా మారాయి.
పట్టించుకోని అధికారులు
వర్షాలు వస్తున్నాయని తెలిసినా అధికారులు ముందుస్తు చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్ల నిర్వహణలో ఆర్అండ్ బీ, పంచాయితీ రాజ్ అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తుంది. సమస్యత్మక ప్రాంతాలను గుర్తించడంతో పాటు రోడ్ల నిర్వహణ కోసం ప్రణాళికను కూడా అమలు చేయలేదు. కనీసం గుంతలు పూడ్చే ప్యాచ్ వర్క్ పనులు కూడా చేపట్టకపోవడంతో ప్రజలు భయం భయంగా ప్రయాణిస్తున్నారు. రోడ్ల కోసం అధికారుల వద్దకు వెళ్తే నేతలను ఒప్పించాలని చెబుతున్నారని, వినతులు ఇచ్చినా ప్రయోజనం లేకుండాపోతుందని వాపోతున్నారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగుతూ.. నీళ్లు నిలిచిన రోడ్లపై వరి నాట్లు వేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం తక్షణమే స్పందించి జిల్లాలోని రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

