విద్యుత్‌ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం: వామపక్షాలు

కలం, కరీంనగర్ బ్యూరో: పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని, డిస్కములను ప్రైవేటుపరం చేయొద్దని డిమాండ్ చేస్తూ 26 ఏళ్ల క్రితం నిర్వహించిన విరోచిత విద్యుత్ పోరాటంలో అమరులైన బాలస్వామి విష్ణువర్ధన్ రామకృష్ణల స్ఫూర్తితో ఉద్యమించాలని వామపక్ష పార్టీల (Karimnagar CPI) నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎమ్మెల్ మాస్ లైన్, ఏఐఎఫ్ బి పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ పోరాట అమరవీరుల స్థూపం దగ్గర పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, ఏఐఎఫ్ బి రాష్ట్ర ఇంచార్జ్ జనరల్ సెక్రెటరీ అంబటి జోజిరెడ్డి, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు జిందం ప్రసాద్ లు మాట్లాడారు. ప్రపంచ బ్యాంకు సంస్కరణలలో భాగంగా విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటుపరం చేయడానికి ఆనాటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు తొలుత ఏపీఎస్‌ఈబీని 3 ముక్కలుగా చేశారని గుర్తు చేశారు.

వామపక్ష పార్టీలు ఫైర్..

విద్యుత్ ఛార్జీల వడ్డన ఒకేసారి 200% పెంచడం, ప్రభుత్వ డిస్కములను, ముక్కలు చేయడంతో వామపక్ష పార్టీలు ఆగ్రహించాయి. 5 నెలల పాటు గ్రామాల్లో వివిధ రూపాల్లో ఆందోళన పోరాటాలు నిర్వహించి, చివరగా ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసి, చలో అసెంబ్లీకి బయలుదేరాయి. ఈ సందర్భంగా బషీర్బాగ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా నాటి టీడీపీ ప్రభుత్వం ఉద్యమకారులపై పాషవికంగా పోలీసులు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ముగ్గురు ఉద్యమకారులు మరణించారని అన్నారు.

అనేకమందికి బుల్లెట్ గాయాలయ్యాయని, వేలాది మందికి లాటి దెబ్బలు తగిలాయన్నారు. నాటి ప్రజా ఉద్యమాన్ని మరో జలియన్‌వాలా బాగ్‌ చేయాలని ప్రభుత్వం చూసిందని చెప్పారు. బషీర్‌బాగ్‌ వద్ద ప్రదర్శనను అడ్డుకుని ఏకపక్షంగా బుల్లెట్ల వర్షం కురిపించిందన్నారు. నాటి అమరుల త్యాగాలు వృధా కాలేదన్నారు. విద్యుత్తు ప్రైవేటీకరణ ఆగిపోయిందంటే అది వారి త్యాగ ఫలితమేనని చెప్పారు.

అది ఉద్యమ ఫలితమే..

నేటికీ వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అందుతున్నదంటే అది ఆ ఉద్యమ ఫలితమేనన్నారు. ప్రజల పెట్టుబడి, కార్మికుల శ్రమతో నిర్మించుకున్న ప్రభుత్వరంగ విద్యుత్‌ సంస్థలను కారుచౌకగా కొనుగోలు చేయడానికి ప్రభుత్వాలను దళారులుగా వాడుకోవడానికి పెట్టుబడిదారులు తెగబడుతున్నారని అన్నారు. ఈ కీలకమైన రంగాన్ని అదానీ, అంబానీలకు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం తెగబడిందని చెప్పారు. ఆనాటి విద్యుత్తు ఉద్యమం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.

కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్తును కేంద్ర జాబితాలోకి తీసుకుంటూ చట్టాలు చేసిందన్నారు. చమురు క్షేత్రాలను (సముద్రాన్ని), బొగ్గు క్షేత్రాలను, గ్యాస్‌ వనరులను బడా కార్పొరేట్లకు దోచి పెట్టడానికి చట్టాలలో అనేక మార్పులు చేసిందనీ, సింగరేణి లాంటి ప్రభుత్వరంగ సంస్థలకు క్రమక్రమంగా బొగ్గు క్షేత్రాలు లేకుండా చేసే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. వ్యవసాయరంగంలో విద్యుత్‌ వినియోగానికి, మోటర్లకు మీటర్లు బిగించాలని రాష్ట్రాలకు సర్య్కులర్‌ జారీ చేసిందన్నారు. 2020 విద్యుత్‌ సవరణ చట్టం ప్రకారం విద్యుత్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు అన్నీ ప్రైవేటువారికి కారుచౌకగా అప్పగించడానికి, ప్రైవేట్‌ విద్యుత్‌ ఉత్పత్తిదారులైన రిలయన్స్‌, అదానీ వంటి కంపెనీలకు లాభాలు వచ్చే విధంగా విద్యుత్‌ ఛార్జీలను నిర్ణయించేలా విధానం రూపొందించిందని చెప్పారు.

అలా చేస్తే.. దేశ ప్రజల భవిష్యత్తే అంధకారం..

అత్యంత కీలకమైన విద్యుత్‌ రంగం దేశమంతటా ప్రైవేటు వ్యక్తుల స్వంత ఆస్థిగా మారిపోతే మొత్తం దేశ ప్రజల భవిష్యత్తే అంధకారంగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలు, వ్యవసాయ రంగం, సామాజిక న్యాయం, త్రాగునీటి పథకాలు అన్నీ సంక్షోభంలోకి నెట్టబడతాయన్నారు. అయితే అదానీ,అంబానీలు మాత్రం ప్రపంచస్థాయి కుబేరులుగా మరింతగా వెలిగిపోతారన్నారు.

ప్రజలకు మతం, కులం, భాష, ప్రాంతం భావోద్వేగాలు ఎక్కించి వారిని మత్తులో ఉంచి విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయించుకునే ప్రయత్నంలో బడా కార్పొరేట్లు, పాలకవర్గాలు బిజీగా ఉన్నాయని, ఏమరుపాటుగా ఉంటే ప్రజల ఆస్థులు సంపదలు ఏమీ మిగలకుండా కేవలం కొద్ది కుటుంబాల వ్యక్తిగత ఆస్తిగా మారిపోతాయన్నారు. ఆనాటి విద్యుత్‌ పోరాట స్ఫూర్తితో కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ సంస్కరణల చట్టం రద్దు అయ్యేంతవరకు తిరిగి ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, బూడిద సదాశివ, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం, గిట్ల ముకుంద రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు డి నరేష్ పటేల్, నాయకులు గజ్జల శ్రీకాంత్, రాయికంటి శ్రీనివాస్, పుల్లెల మల్లయ్య, సురేష్, వి.శివ కుమార్. సిపిఐ నాయకులు బాకం ఆంజనేయులు, నగునూరి రమేష్, నునావత్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>