కలం, వెబ్ డెస్క్: భారత్–అమెరికా రక్షణ ఒప్పందాల్లో (India US Defence Deal) మరో కీలక ముందడుగు పడింది. క్షిపణి వ్యవస్థల్లో అత్యంత అధునాతనంగా పేర్కొనే ‘జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడ్ మిస్సైల్స్’ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని భారత్ లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ప్రకటించారు. అమెరికా విదేశీ రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్ల ప్రక్రియ ద్వారా వీటిని సమీకరించుకునేందుకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ (LOA) కూడా జారీ చేసిందన్నారు. భారత రక్షణ ఉత్పత్తి పరిశ్రమలు, అమెరికా సంస్థలు భవిష్యత్తులో మరింత కలిసి పనిచేసేలా ఈ నిర్ణయం ఉపకరిస్తుందన్నారు. ఈ మిస్సైల్ రాకతో భారత్ అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రం చేరినట్లవుతుంది. పాకిస్థాన్, చైనా వంటి దేశాలను కూడా ఇది సవాల్ చేసే స్థాయిలో ఉంటుందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
జావెలిన్ ప్రత్యేకతలు ఇవే..
రాకెట్ లాంఛర్ల మాదిరే జావెలిన్ క్షిపణులను కూడా భుజాలపై పెట్టుకుని ప్రయోగించవచ్చు. ఇదొక మధ్య శ్రేణి ఫైర్ అండ్ ఫర్గెట్ యాంటీ మిస్సైల్ సిస్టం. ప్రస్తుతం అమెరికాలోని ఆర్మీ, మెరైనా కార్ప్స్ వీటిని వినియోగిస్తున్నాయి. సుదూరాన ఉన్న సాయుధ వాహనాలతో పాటు పటిష్టమైన రక్షణ స్థావరాలు లక్ష్యంగా వీటిని ప్రయోగించవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఫైర్ చేయొచ్చు. సులువుగానే మోసుకెళ్లడంతో పాటు నిర్దేశించిన లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదిస్తుంటాయి. దాదాపు 16 ఏళ్ల తరువాత అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయబోతున్న మిస్సైల్ సిస్టం ఇదే కావడం గమనార్హం.

