కలం, వెబ్ డెస్క్: టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ హిమపాతం, వరదల కారణంగా చిక్కుకుపోయిన తెలుగు రాష్ట్రాల మానస సరోవర్ యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) కోరారు. టిబెట్ సరిహద్దు పరిసర ప్రాంతాల్లో గ్లేసియర్ (హిమానీనదం) విరిగిపడటంతో ఒక్కసారిగా భారీ స్థాయిలో వరద నీరు పోటెత్తిందని అన్నారు. ఈ ప్రకృతి విపత్తులో దాదాపు 500 మందికి పైగా మరణించినట్లు సమాచారం అందుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
భారీగా తరలివెళ్లిన భక్తులు..
పవిత్ర మానస సరోవర్ యాత్ర కోసం దేశం నలుమూలల నుంచే కాకుండా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్లారని చెప్పారు. వీరిలో తెలంగాణ నుంచే సుమారు 22 మందికి పైగా భక్తులు ఉన్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకునేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా మానిటరింగ్ టీమ్‌లను (పర్యవేక్షణ బృందాలు) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాఖీ వేళ ఆత్మీయులు ఎదురుచూస్తున్నారు..
చిక్కుకున్న భక్తులు క్షేమంగా ఉన్నారా లేదా అనే వివరాలను సేకరించి, ఆందోళనలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించాలని అన్నారు. యాత్రికులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేలా తగిన సహాయక చర్యలు, రవాణా ఏర్పాట్లు చేయాలని కోరారు. రాఖీ పండుగ సందర్భంలో ప్రతి కుటుంబం తమ ఆత్మీయులు సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని కోరుకుంటుందని చెప్పారు. సరిహద్దుల్లో చిక్కుకున్న భక్తుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో ఎదురుచూస్తున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని తెలుగు యాత్రికులంతా క్షేమంగా స్వరాష్ట్రాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

