కలం, వెబ్ డెస్క్: సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై పోలీసులతో జులుం.. ప్రజలపై పోలీసులతో జులుం అంటూ రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు. ఇటీవల మహబూబాబాద్‌లో ఓ పోలీసు అధికారి పాలిటెక్నిక్ విద్యార్థి గొంతు పిసికి క్రూరంగా ప్రవర్తించాడని ఆరోపించారు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో తన కుమార్తెకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తిని పోలీసులు బూటుకాళ్లతో తన్ని, మూత్రం తాగించారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. నేడు సూర్యాపేటలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని కేసులు నమోదు చేశారని ఫైర్ అయ్యారు. కోదాడలో బడ్డీ కొట్టు తొలగించారని, నిరసన తెలిపిన వారిపై స్థానిక సీఐ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని విమర్శించారు.
అసలు తెలంగాణలో ఉన్నది ప్రభుత్వమా? లేక పోలీసు పాలనా.. రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం.. నిరసనలు చేస్తే అరెస్టులు చేస్తారా? అని ప్రశ్నించారు. హక్కులు అడిగితే దౌర్జన్యాలు..ఇదేనా మీరు చెప్పుకున్న ప్రజాపాలన? అని ఫైర్ అయ్యారు. రాష్ట్ర డీజీపీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. కారకులైన పోలీసులపై విచారణ జరిపి తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

