కలం, కరీంనగర్: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమానురాగాలకు, ఆత్మీయ బంధానికి రక్షాబంధన్ (Raksha Bandhan) పండుగ సజీవ ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని కరీంనగర్‌లోని యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా కార్పొరేటర్లు, బ్రహ్మకుమారీస్ సోదరీమణులు, మహిళలు క్యాంప్ కార్యాలయానికి చేరుకుని సునీల్ రావుకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేటర్లు సుదగోని మాధవి కృష్ణ గౌడ్, గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్‌తో పాటు బ్రహ్మకుమారీస్ సోదరీమణులు, భగత్‌నగర్‌కు చెందిన కవిత, ఇతర మహిళా సోదరీమణులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రేమాభిమానాలతో రాఖీలు కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, నమ్మకం, ఆత్మీయతను మరింత బలపరిచే గొప్ప సంప్రదాయమని పేర్కొన్నారు. సమాజంలో పరస్పర గౌరవం, సోదరభావం పెంపొందించడంలో ఇలాంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. తనపై ఎనలేని ప్రేమాభిమానాలు చూపుతూ రాఖీలు కట్టిన సోదరీమణులందరికీ యాదగిరి సునీల్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా ప్రతి కుటుంబంలో ఆనందం, సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

