కలం, వెబ్ డెస్క్ : విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి (Overseas Scholarship) పథకం కింద 2026 ఆగస్టు, సెప్టెంబర్ ఫాల్ సెషన్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కమిషనర్ బాలమయాదేవి ప్రకటన విడుదల చేశారు.
ఈ విడతలో మొత్తం 350 మంది అర్హులైన విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఇందులో 250 మంది బీసీ విద్యార్థులు, 100 మంది ఈబీసీ విద్యార్థులు ఉంటారు. విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ వంటి కోర్సులు చేయాలనుకునే వారు సెప్టెంబర్ 1, 2026 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం అన్ని మార్గాల నుంచి రూ.5 లక్షల లోపు ఉండాలి.
దరఖాస్తు సమయానికి విద్యార్థి వయస్సు 35 ఏళ్లు మించకూడదు. అలాగే డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండటం విధిగా నిర్ణయించారు. అర్హత పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు జిఆర్ఈ (GRE) లో 260 లేదా జిమాట్ (GMAT) లో 500 స్కోరు సాధించి ఉండాలి. భాషా నైపుణ్య పరీక్షల్లో టోఫెల్ (TOEFL) లో 60, ఐఎల్టీఎస్ (IELTS) లో 6.0 లేదా పిటిఈ (PTE) లో 50 స్కోరు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
అర్హత ఉన్న అభ్యర్థులు నిర్దేశిత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం అలాగే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయడానికి తెలంగాణ ఈ-పాస్ అధికారిక వెబ్సైట్ http://www.telanganaepass.cgg.gov.in ను సందర్శించాలని కమిషనర్ సూచించారు.

