2047 నాటికి 50 శాతం పచ్చదనమే లక్ష్యం: నాగబాబు

కలం, వెబ్ డెస్క్: ఏపీలో ప్రస్తుతం ఉన్న అటవీ, వృక్ష సంపదను విస్తరించి 2047 నాటికి పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని రాష్ట్ర గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు తెలిపారు. పర్యావరణ పరిరక్షణను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజలందరూ భాగస్వామ్యమయ్యే మహోద్యమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. శుక్రవారం మంగళగిరి అరణ్యభవన్ లో ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీ గ్రీన్ సొసైటీ నిర్దేశించుకున్న లక్ష్యాలను సమర్థవంతంగా సాధించేందుకు పూర్తి చిత్తశుద్ధితో కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, అటవీ విస్తీర్ణం అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల సాధనకు ఏపీ గ్రీన్ ద్వారా కృషి చేస్తానని చెప్పుకొచ్చారు.

పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడమే లక్ష్యం..

ప్రస్తుతం రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 22.96 శాతంగా ఉందని నాగబాబు చెప్పారు. రాబోయే 2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ, వృక్ష సంపదను కలిపి పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇది కేవలం గణాంకాల కోసం పెట్టుకున్న లక్ష్యం కాదని.. భావి తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన పర్యావరణం, మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.

వాతావరణ మార్పులు ప్రపంచానికి సవాలుగా మారుతున్న ఈ సమయంలో పర్యావరణ పరిరక్షణ అనేది తామందరి బాధ్యత అని చెప్పుకొచ్చారు. అందుకే ఏపీ-గ్రీన్ కార్యక్రమాన్ని కేవలం అడవులకే పరిమితం చేయకుండా, రాష్ట్రంలోని ప్రతి అనుకూలమైన ప్రాంతంలో పచ్చదనాన్ని పెంచేలా కార్యాచరణ చేపడుతున్నామని స్పష్టం చేశారు. వ్యవసాయ భూములు, గ్రామాలు, పట్టణ ప్రాంతాలు, ప్రధాన రహదారుల ఇరువైపులా, కాలువ గట్లు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రాంగణాలు, పరిశ్రమల పరిసరాలు, అనుకూలమైన బంజరు భూములు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామని అన్నారు.

అన్ని శాఖల సమన్వయంతో కార్యాచరణ..

ఈ బృహత్తర లక్ష్యం విజయం కావాలంటే ఒక్క శాఖతో సాధ్యమయ్యేది కాదని నాగబాబు అన్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, పంచాయతీరాజ్, విద్య, పరిశ్రమలు, రెవెన్యూ, జలవనరులు, రవాణా, అటవీ శాఖలతోపాటు అన్ని సంబంధిత ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఏపీ గ్రీన్ కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా మాత్రమే ఉండకూడదని చెప్పారు. రైతులు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత సంస్థలు, విద్యార్థులు, యువత, పారిశ్రామికవేత్తలు, ప్రతి పౌరుడిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలనుకుంటున్నామని వివరించారు.

ఏపీ-గ్రీన్‌ను ఒక ప్రభుత్వ పథకంగా కాకుండా, ప్రజలందరూ భాగస్వామ్యమయ్యే గొప్ప ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. మొక్కలు నాటడం మాత్రమే తమ లక్ష్యం కాదని.. నాటిన మొక్కలను బతికించడం, వాటిని సంరక్షించడం, అవి ఆరోగ్యంగా ఎదిగేలా చూడటమే అసలైన బాధ్యత అని చెప్పుకొచ్చారు. నాటిన ప్రతి మొక్క మనుగడపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. వాటి సంరక్షణ, నిర్వహణ కోసం ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>