జర్మనీని చిత్తు చేసిన భారత్.. చరిత్రాత్మక ఫినిష్

కలం, స్పోర్ట్స్‌: మహిళల హాకీ వరల్డ్‌కప్‌లో (Womens Hockey World Cup) భారత (India) జట్టు సత్తా చాటింది. ఐదో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో జర్మనీని (Germany) 3-1తో ఓడించి టోర్నీలో ఐదో స్థానాన్ని సొంతం చేసుకుంది. దీంతో 1974 తర్వాత వరల్డ్‌కప్‌లో భారత్‌ సాధించిన అత్యుత్తమ ఫినిష్‌ను మరోసారి సమం చేసింది. మ్యాచ్‌ ఆరంభంలో ఇరు జట్లు జాగ్రత్తగా ఆడాయి. భారత్‌ రక్షణకు ప్రాధాన్యం ఇవ్వగా.. జర్మనీ కూడా గోల్‌ కోసం ప్రయత్నించింది. తొలి క్వార్టర్‌లో ఇరు జట్లకు గోల్‌ దక్కలేదు. క్వార్టర్‌ చివర్లో జర్మనీకి పెనాల్టీ కార్నర్‌ లభించగా.. భారత్‌ రివ్యూ కోరింది. అయితే వీడియో అంపైర్‌ నిర్ణయాన్ని సమర్థించడంతో భారత్‌ రిఫరల్‌ను కోల్పోయింది. అయినప్పటికీ జర్మనీ ఆ అవకాశాన్ని గోల్‌గా మలచలేకపోయింది.

రెండో క్వార్టర్‌లో భారత్‌ దాడులను పెంచింది. నవనీత్‌, కెప్టెన్‌ సలీమా టెటే గోల్‌ కోసం ప్రయత్నించారు. వరుసగా మూడు షాట్లు జర్మనీ గోల్‌పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ.. గోల్‌కీపర్‌ ఫింజా స్టార్క్‌ అడ్డుకుంది. దీంతో తొలి అర్ధభాగం 0-0తో ముగిసింది. మూడో క్వార్టర్‌లో భారత్‌ మ్యాచ్‌ను పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకుంది. 43వ నిమిషంలో ఇషికా రివర్స్‌ లిఫ్ట్‌తో అద్భుతమైన గోల్‌ చేసి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. ఆ వెంటనే 44వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను నవనీత్‌ గోల్‌గా మలిచి ఆధిక్యాన్ని 2-0కు పెంచింది.

నవనీత్‌ మరోసారి 47వ నిమిషంలో గోల్‌ చేసి భారత్‌ను 3-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. దీంతో కొద్ది నిమిషాల వ్యవధిలోనే భారత్‌ మూడు గోల్స్‌ సాధించింది. చివరి క్వార్టర్‌లో జర్మనీ పోరాటం చేసినా.. భారత డిఫెన్స్‌ పటిష్టంగా నిలిచింది. 59వ నిమిషంలో లిన్‌ క్రింగ్స్‌ గోల్‌ చేసినప్పటికీ.. ఆ తర్వాత మరో గోల్‌కు భారత్‌ అవకాశం ఇవ్వలేదు. చివరికి 3-1తో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్‌ ఐదో స్థానాన్ని ఖరారు చేసుకుంది. 1974లోనూ భారత్‌ ఐదో స్థానంలో నిలిచింది. 52 ఏళ్ల తర్వాత అదే ఫలితాన్ని మరోసారి సాధించడం ద్వారా మహిళల హాకీ వరల్డ్‌కప్‌లో తమ అత్యుత్తమ స్థానాన్ని సమం చేసింది.

టోర్నీ మొత్తం భారత రక్షణ విభాగం ఆకట్టుకుంది. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లను గోల్‌ చేయకుండా అడ్డుకుంది. అయితే గోల్స్‌ సాధించడంలో ఎదురైన ఇబ్బందుల కారణంగా సెమీఫైనల్‌ అవకాశాన్ని కోల్పోయింది. జర్మనీపై మూడు గోల్స్‌తో టోర్నీని ఘనంగా ముగించింది. ముఖ్యంగా నవనీత్‌ రెండు గోల్స్‌ చేయడం జట్టు విజయానికి కీలకంగా మారింది. వరల్డ్‌కప్‌ తర్వాత భారత జట్టు ఆసియా క్రీడలపై దృష్టి సారించనుంది. ఈ టోర్నీలో ఎదురైన అనుభవం భవిష్యత్‌ పోటీల్లో జట్టుకు ఉపయోగపడనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>