భగ్గుమన్న వర్గ పోరు.. సోషల్ మీడియాలో వార్!

కలం, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ​అశ్వారావుపేట బీఆర్ఎస్ (Aswaraopeta BRS) పార్టీలో వర్గ పోరు భగ్గుమంది. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలను సైతం పక్కనబెట్టి సాగుతున్న ఆధిపత్య ధోరణి ఇప్పుడు నియోజకవర్గ గులాబీ శ్రేణుల్లో చర్చకు దారి తీస్తోంది. పార్టీ అధికారిక వాట్సాప్ గ్రూప్‌ల్లో సాగుతున్న వార్.. అశ్వారావుపేట రాజకీయాన్ని తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తోంది.

అసలు ఏం జరిగిందంటే..

​అధిష్ఠానం ఇచ్చిన ఆదేశాలను బహిరంగంగా ఉల్లంఘించడమే మొత్తం వివాదానికి కారణం. రాష్ట్ర స్థాయి మినహా గ్రామీణ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీలను రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే, ఈ నిర్ణయాన్ని పట్టించుకోకుండా మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని స్థానిక నాయకులు మండిపడుతున్నారు.

తనకు సంబంధం లేని అశ్వారావుపేట నియోజకవర్గానికి మెచ్చా నాగేశ్వరరావును ఇన్‌ఛార్జిగా ప్రకటిస్తూ రేగా కాంతారావు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇక్కడి కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. “స్థానిక కమిటీలు రద్దయ్యాక నియోజకవర్గ ఇన్‌ఛార్జిని ప్రకటించే అధికారం అసలు రేగాకు ఎవరిచ్చారు? కేటీఆర్ మాట కంటే రేగా పెత్తనమే ఎక్కువైందా?” అని బీఆర్‌ఎస్ శ్రేణులు వాట్సాప్ గ్రూప్‌ల్లో నిలదీస్తున్నాయి.

ఫిర్యాదుకు రెడీ..

ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుకు అనుకూలంగా కార్యకర్తలు పోస్టులు పెట్టడంతో వివాదం మరింత ముదిరింది. ‘తాటి’ వర్గంపై రేగా కాంతారావు గ్రూప్‌లో హెచ్చరికల స్వరం వినిపించడంతో ఆ వర్గం సమరశంఖం పూరించింది. ​రేగా కాంతారావు పార్టీ క్రమశిక్షణను దెబ్బతీస్తున్నారని తాటి వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆధిపత్య పోరుతో క్షేత్రస్థాయిలో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని వివరిస్తూ.. ఆధారాలతో కేసీఆర్, కేటీఆర్‌కు ఫిర్యాదు చేసేందుకు అశ్వారావుపేట నాయకులు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో అశ్వారావుపేట బీఆర్‌ఎస్‌లో ఏ మలుపు తిరుగుతాయోనని చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>