కలం, ఖమ్మం బ్యూరో: గంజాయి మత్తులో చిక్కుకున్న వారిని కొత్తగూడెం పోలీసులు (Kothagudem Police) పునరావాస కేంద్రాలకు తరలించారు. వారు తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టారు. మూడో పట్టణ పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఇంద్రసేనా రెడ్డి వివరాలు వెల్లడించారు. గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. జడ్జి ఆదేశాల మేరకు మానవతా దృక్పథంతో డీ-అడిక్షన్ సెంటర్‌లో చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టారు.
యువతకు కీలక సూచన..
ఈ సందర్భంగా SHO ఇంద్రసేనా రెడ్డి మాట్లాడుతూ.. యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. వాటి వలన కలిగే దుష్పరిణామాలపై తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. వారి ప్రవర్తనపై నిరంతరం దృష్టి సారించాలని కోరారు. మత్తు పదార్థాలకు బానిసైన వారిని కేవలం శిక్షించడం మాత్రమే కాకుండా, అవసరమైన సందర్భాల్లో చికిత్స, పునరావాసం అందించడం ద్వారా వారిని తిరిగి సాధారణ జీవన విధానంలోకి తీసుకురావడానికి పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయం, సరఫరా, రవాణా, వినియోగానికి పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

