కలం, వెబ్ డెస్క్: మంత్రి కొండా సురేఖ (Konda Surekha)కు మరో షాక్ తగిలింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఆమె ఫొటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. సీతక్క సహా పలువురు మంత్రుల ఫొటోలు పెట్టి.. కొండా సురేఖ చిత్రం మాత్రం లేకపోవడం గమనార్హం. అధికారిక కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకే చెందిన మంత్రి సురేఖ ఫొటో పెట్టకపోవడంపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వస్తున్నాయి. సమాచార లోపమా.. ఉద్దేశపూర్వకంగా జరిగిందా.. అని కొండా వర్గీయులు కూడా ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు.
వరంగల్ జిల్లాకే పరిమితం..
వివాదం నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ వరంగల్లోని తన నివాసానికే పరిమితమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ రాకుండా నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నారు. ఇటీవలే ఆమె నిర్వహిస్తున్న శాఖలో డిప్యూటేషన్లు రద్దు చేయడం, తాజాగా అధికారిక కార్యక్రమంలో ఆమె ఫొటో పెట్టకపోవడంపై ఏదో జరుగబోతుందనే చర్చ మరింత బలపడుతోంది.

