కలం, వెబ్ డెస్క్: ఇండియాలో తాను చేసిన అప్పులు మొత్తం చెల్లించినా చివరికి అన్యాయమే జరిగిందని ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా (Vijay Mallya) ఆవేదన వ్యక్తం చేశారు. జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర చెల్లించాల్సిన అప్పులకు సంబంధించిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కీలక నిర్ణయం వెలువరించిన వేళ దానిపై స్పందిస్తూ విజయ్ మాల్యా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ‘నా మిత్రుడు సుభాష్‌కు అభినందనలు. భారత ప్రభుత్వం, బ్యాంకులు నేను చెల్లించాల్సిన రూ.6,203 కోట్ల అప్పులకు రూ.14,100 కోట్లు వసూళ్లు చేసుకున్నాయి. ఇప్పుడు ఎంతో మంది రుణ గ్రహీతలు చాలా తక్కువకే సెటిల్మెంట్స్ చేసుకుంటున్నారు. బహుశా అక్కడ రుణ పరిష్కారంలో న్యాయం అంటే ఇదే కావొచ్చు. దీన్ని ఏ మీడియా ప్రశ్నించదు’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.
అసలేం జరిగిందంటే..
జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర పలు ఆర్థిక సంస్థల నుంచి రూ.22,006 కోట్ల రుణాలు సేకరించి, చెల్లించడంలో జాప్యం చేస్తూ వస్తున్నారు. దీంతో అప్పులు ఇచ్చినవారంతా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. రూ.6.5 కోట్లు చెల్లించి రుణ సమస్యలను పరిష్కరించుకోవచ్చని తీర్పు వెలువరించింది. ఆయన తీసుకున్న రుణాల్లో ఇది 0.03 శాతం కావడం గమనార్హం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ విజయ్ మాల్యా విమర్శలు గుప్పించారు. సుభాష్ తీసుకున్న రుణాలకు రూ.6.5 కోట్లు చెల్లిస్తే సరిపోతుందన్న ట్రిబ్యునల్.. తన నుంచి మాత్రం రెట్టింపు వసూళ్లు చేయడంపై మండిపడ్డారు.

