కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)ను ఏర్పాటు చేసి, యువతకు ఆధునిక కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) తెలిపారు.
యువత కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, ఇతరులకు ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా దూరదృష్టితో ఈ కేంద్రాలను ప్రభుత్వం రూపుదిద్దుతోందని పేర్కొన్నారు. ఖమ్మం (Khammam) జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామ పంచాయతీ పరిధి గోపాలపురం ప్రాథమిక పాఠశాలలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న రెండు అదనపు తరగతి గదుల నిర్మాణానికి గురువారం ఆయన జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. విద్యార్థుల సంక్షేమం కోసం ఉపాధ్యాయుడు తన సొంత డబ్బులు సుమారు రూ.40 వేలు వెచ్చించి తాత్కాలిక షెడ్డు నిర్మించడం అత్యంత అభినందనీయమని కొనియాడారు. పిల్లలకు మెరుగైన వసతి కల్పించాలనే తపనతో ఆ ఉపాధ్యాయుడు చూపిన సేవాభావాన్ని హృదయపూర్వకంగా శ్లాఘిస్తున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, అన్ని ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. సంక్షేమ రంగానికి కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందని, మొదటి దశ పూర్తయి ప్రస్తుతం రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆగస్టు 31 వరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రైతు సంక్షేమంతో పాటు మహిళా సంఘాలకు రూ. 63 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ, గోపాలపురం పాఠశాల భవనం తీవ్రంగా దెబ్బతిని శిథిలావస్థకు చేరడంతో మంత్రి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా రూ.30 లక్షల నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. ఈ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి, త్వరలోనే మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏదులాపురం మునిసిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బీ, హౌసింగ్ శాఖల అధికారులు, ఖమ్మం ఆర్డీవో, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

