కలం, వరంగల్ బ్యూరో: పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను (Dasyam Vinay Bhasker) పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని ఆరోపించారు.
జీఓ 97 ద్వారా విద్యార్థులపై కఠిన విధానాలను అమలు చేస్తున్నారని, వాటిని ప్రశ్నిస్తున్న నాయకులను నిర్బంధించడం అప్రజాస్వామికమన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, అక్రమ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న హరీశ్‌రావును హౌస్ అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కుల హననమని మండిపడ్డారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థి, ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. పేదల భూములను 22ఏ పేరుతో లాక్కునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసే వరకు, ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగిస్తుందని వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు.

