కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా కొత్తగూడెం పట్టణ పరిధిలోని రామవరం (Ramavaram) మాతా శిశు సంరక్షణ కేంద్రం (MCH) లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే 26 నెలల చిన్నారి మృతి చెందిందంటూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళనకు దిగారు.
సకాలంలో స్పందించి చికిత్స అందించకపోవడం వల్లే తమ పాప ప్రాణాలు కోల్పోయిందని ఆస్పత్రి ప్రాంగణంలో ఆక్రోశం వ్యక్తం చేశారు. ములకలపల్లి మండలానికి చెందిన విజయలక్ష్మి 26 నెలల పాపకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన రామవరం మాతా శిశు కేంద్రానికి తీసుకువచ్చారు.
అయితే అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రికి తీసుకొచ్చినప్పటికీ అక్కడి సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదని, వారి అలసత్వమే పాప మృతికి కారణమైందని బంధువులు తీవ్రంగా ఆరోపించారు. చిన్నారి మరణానికి బాధ్యులైన సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో ఆస్పత్రి వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
విషయం తెలుసుకున్న చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించిన అనంతరం కేసు నమోదు చేసి, ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వెల్లడించారు.

