కలం, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు (Harish Rao)ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు చేపడుతున్న ఆందోళనకు మద్దతుగా సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న ఆయనను రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన పర్యటనకు బయలుదేరుతున్న సమయంలో భారీగా మోహరించిన పోలీసులు హరీశ్ రావు నివాసం బయటకు రాకుండా నిరోధించారు. శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం ముందస్తు చర్యగా ఈ ఆంక్షలు విధించినట్లు అధికారులు స్పష్టం చేసినప్పటికీ, ఆయన పర్యటనకు బ్రేక్ పడటంతో హౌస్ అరెస్ట్‌కు దారితీసింది.
ప్రతిపక్ష నేతల పర్యటనలను, విద్యార్థులకు సంఘీభావం తెలిపే ప్రయత్నాలను పోలీసులు అడ్డుకోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

