కలం, నిజామాబాద్ బ్యూరో : కల్వకుంట్ల కవిత (Kavitha) ఆడపిల్లకు తాళి కట్టారు.. అవును నిజమే హైదరాబాద్ ఈసీఐఎల్ కీసర రోడ్డులోని ఆరాధ్య ఫంక్షన్ హాలులో ఈ దృశ్యం కనిపించింది.. నిజంగానే ఒక వధువు మెడలో కల్వకుంట్ల కవిత తాళి కట్టారు.
ఎందుకంటే..?
తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించాడు. తన ఇంటి ఆడబిడ్డ హోదాలో ఉండి పెళ్లి చేయాలని కోరాడు. ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం పెళ్లికూతురు మెడలో తాళి కట్టాలని కోరాడు. పార్టీ నాయకుడి ఆకాంక్షను గౌరవించి ముదిరాజ్ ఇంటి ఆడబిడ్డగా మారి ఆ నాయకుడి ఆకాంక్షను నెరవేర్చారు కల్వకుంట్ల కవిత. ఈ వేడుకకు ఈసీఐఎల్ – కీసర క్రాస్ రోడ్డులో ఆరాధ్య కన్వేషన్ వేదికగా నిలిచింది.
యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాషబోయిన బాలప్రసాద్ తెలంగాణ రక్షణ సేన నాయకుడు. తెలంగాణ జాగృతిలోనూ క్రియాశీలంగా పని చేశాడు. బాలప్రసాద్ కు సీతాఫల్ మండికి చెందిన శివానితో వివాహం నిశ్చయం అయింది. బుధవారం ఉదయం బాలప్రసాద్ – శివాని వివాహ ముహూర్తం కాగా తనకు అక్కాచెల్లెళ్లు లేకపోవడంతో బాలప్రసాద్ కోరిక మేరకు వారి ఇంటి ఆడబిడ్డగా కవిత వ్యవహరించారు.
ముదిరాజ్ కుల ఆచారం ప్రకారం వరుడు వధువుకు తాళి కట్టే ముందు ఆడపడుచుతో పసుపు కొమ్ముతో మూడు ముళ్ళు వేయిస్తారు. వారి సంప్రదాయం ప్రకారం కవిత గౌరీ పూజలో పాల్గొని వధువు శివాని మెడలో పసుపు కొమ్ముదారంతో మూడుముళ్లు వేశారు. ఉంగరపు వేలుకు ప్రదానపు ఉంగరం తొడిగారు. ఒడిబియ్యం పోసి పెళ్లి కుమార్తెను ఆశీర్వదించారు. అనంతరం బాలప్రసాద్ శివాని మెడలో మంగళసూత్ర ధారణ చేశారు. ఈ వేడుకలో బాలప్రసాద్ తల్లిదండ్రులు స్వరూప – బాలకృష్ణ, సోదరుడు నాగరాజు, తెలంగాణ రక్షణ సేన నాయకులు పాల్గొన్నారు.
-పెళ్లి కూతురికి తాళి కట్టిన కల్వకుంట్ల కవిత!
-మూడుముళ్లు వేసి ఉంగరం తొడిగిన కవిత
-ఈసిఐఎల్ – కీసర రోడ్డులోని ఫంక్షన్ హాలులో వేదికగా అరుదైన దృశ్యం ఆవిష్కారం
Kalvakuntla Kavitha Ties Mangalsutra at Party Leader Wedding in Unique Tradition#KalvakuntlaKavitha #TRS #MudirajTradition… pic.twitter.com/aQnCUlMR5b— Kalam Daily (@kalamtelugu) August 26, 2026

