కలం, వెబ్ డెస్క్: 29 ఏళ్లకే రిటైర్ అయ్యానంటూ పూణే మహిళ చేసిన ప్రకటన సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. స్నేహా రాజ్గురు అనే మహిళ ఇన్స్టాలో ‘రిటైర్మెంట్’ గురించి తెలిపారు. ఉద్యోగ జీవితం నుంచి తప్పుకుని, వ్యవసాయం, ప్రకృతి, ప్రశాంతమైన జీవన విధానాన్ని ఎంచుకున్నట్లు ఆమె తెలిపారు. ఆమె చెప్పిన ఆలోచనలు నెటిజన్లలో చర్చకు దారితీశాయి.
తన జీవన విధానానికి సంబంధించి నాలుగు విషయాలను సూచించారు. ముందుగా చిన్న స్థలాన్ని కొనుగోలు చేసి దానికి సొంత గుర్తింపు ఇవ్వాలన్నారు. రెండో దశలో పండ్లను పెంచాలని సూచించారు. అవి ఎక్కువ శ్రమ లేకుండానే పెరిగి, ఏళ్ల తరబడి ఫలాలను అందిస్తాయని చెప్పారు. మూడో దశలో సొంత ఆహారాన్ని పండించుకోవాలని, ఇది ఆహార భద్రతతో పాటు ఇతర వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని వివరించారు. నాలుగో దశగా పొలంలో పూలను పెంచుకోవాలని, ప్రతిరోజూ ప్రకృతి అందాలను చూడటం మనసుకు ప్రశాంతతను ఇస్తుందన్నారు.
రాజ్గురు దృష్టిలో రిటైర్మెంట్ అంటే ఉద్యోగాన్ని వదిలేయడం కాదని, ఒత్తిడికి బదులుగా ప్రశాంతతను ఎంచుకోవడమేనని పేర్కొన్నారు. వ్యవసాయం, సొంత ఆహారం, ప్రకృతితో అనుబంధంతో కూడిన జీవన విధానాన్ని ఆమె ప్రోత్సహిస్తున్నారు. ఉద్యోగ జీవితానికి భిన్నంగా గడుపుతున్న ఆమె ఆలోచనలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

