కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు!

కలం, నేషనల్ డెస్క్: పార్టీ జాతీయ నాయకత్వాన్ని పునర్వ్యవస్థీకరించిన బీజేపీ.. ఇప్పుడు కేంద్ర కేబినెట్ (Union Cabinet) పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టింది. 2029 లోక్‌సభ ఎన్నికలు, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, సామాజిక సమీకరణాలు, యువ నాయకత్వానికి ప్రాధాన్యం, మహిళల ప్రాతినిధ్యం పెంపును దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గ విస్తరణ చేపనున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా పొత్తులను దృష్టిలో ఉంచుకొని ఎన్డీయేలో చేరే కొత్త పార్టీలకు కేబినెట్ బెర్తులు దక్కే అవకాశం కనిపిస్తున్నది. అదే విధంగా ప్రస్తుతం కేబినెట్‌లో కొంతమంది మంత్రులు ఒక్కటి కంటే ఎక్కువ శాఖలను చూస్తుండగా, వాళ్లపై భారం తగ్గించాలని కేంద్రం భావిస్తున్నది. వయసు మీద పడిన, పెర్ఫామెన్స్ సరిగా లేని, రాజ్యసభ పదవీకాలం పూర్తయ్యే మంత్రులను తొలగించాలని యోచిస్తున్నది. ఈ నేపథ్యంలో కూడికలు, తీసివేతలు ఎలా ఉంటాయనే దానిపై ఆసక్తి నెలకొన్నది.

తెలంగాణ నుంచి ఇద్దరు!

ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు. బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మరో ఇద్దరికి చోటు దక్కుతుందనే చర్చ జరుగుతున్నది. వీరిలో మహబూబ్ నగర్ డీకే అరుణతో పాటు మరొకరు ఉన్నారని ప్రచారం సాగుతున్నది. టాటా సన్స్ చైర్మన్‌గా ఇటీవల తప్పుకున్న నటరాజన్ చంద్రశేఖరన్ రాజకీయాల్లో రానున్నట్టు ప్రచారం జరుగుతున్నది. త్వరలో జరగనున్న కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఆయనకు చోటు దక్కవచ్చే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

కేంద్ర మంత్రివర్గంలో మొత్తం 81 మందికి అవకాశం ఉన్నది. ప్రస్తుతం ప్రధాని మోదీ సహా 69 మంది ఉన్నారు. ఇంకో 12 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో ఎవరెవరికి అవకాశం దక్కుతుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. 2027లో పంజాబ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 2028లో కర్నాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఈ రాష్ట్రాలకు ప్రాధాన్యం దక్కుతుందనే చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణకు కేబినెట్ బెర్తులు దక్కే చాన్స్ ఉన్నదని ప్రచారం జరుగుతున్నది.

వీళ్లు ఔట్

  • వివిధ కారణాలతో ముగ్గురు కేంద్రమంత్రులు ఇటీవల రాజీనామా చేశారు. పేపర్ లీకేజీల కారణంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయగా.. రాజ్యసభ పదవీ కాలం పూర్తవ్వడంతో సహాయ మంత్రులు జార్జ్ కురియన్, రవ్‌నీత్ సింగ్ బిట్టు రాజీనామా చేశారు.
  • ఇటీవల జరిగిన జాతీయ నాయకత్వ పునర్వ్యవస్థీకరణలో ముగ్గురు కేంద్రమంత్రులకు పార్టీ పదవులు అప్పగించారు. ఈ నేపథ్యంలో వాళ్లను మంత్రి పదవుల నుంచి తప్పిస్తారని చర్చ జరుగుతున్నది. వీరిలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌, కేంద్ర సహాయ మంత్రులు హర్ష్ మల్హోత్రా, పంకజ్ ఛౌదరి ఉన్నారు.
  • మరో ఇద్దరు కేంద్రమంత్రుల రాజ్యసభ పదవీకాలం నవంబర్‌‌లో ముగియనుంది. వీరిలో హర్దీప్ సింగ్ పూరి, బీఎల్ వర్మ ఉన్నారు.
  • కొంతమంది కేంద్రమంత్రులు సరిగా పని చేయడం లేదని ప్రధాని మోదీకి రిపోర్టులు అందాయి. వాళ్లను మంత్రివర్గం తీసేస్తారని ప్రచారం జరుగుతున్నది.
  • ఇంకొంత మంది కేంద్రమంత్రులకు వయసు మీద పడింది. కేబినెట్‌లో దాదాపు 12 మంది 70 ఏండ్లకు పైబడినవాళ్లు ఉన్నారు. వీరిలో 81 ఏండ్ల జితన్ రామ్ మాంఝీ అందరి కంటే పెద్దవాడు. వయసు పైబడిన మంత్రులను కూడా తొలగిస్తారని చర్చ జరుగుతున్నది.

వీళ్లకు చాన్స్

  • ఇటీవల కొన్ని పార్టీల రెబల్ గ్రూప్స్‌ బీజేపీతో జట్టు కట్టాయి. ఈ జాబితాలో ఆప్, టీఎంసీ గ్రూప్స్ ఉన్నాయి. ఈ వర్గం నేతలకు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంది.
  • రాఘవ్ చద్దా నేతృత్వంలో ఏడుగురు ఆప్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. ఇప్పటికే ఈ గ్రూప్ నుంచి సందీప్ పాఠక్‌కు నేషనల్ సెక్రటరీ పదవి ఇచ్చారు. త్వరలో రాఘవ్ చద్దాకు కేంద్రమంత్రి పదవి దక్కుతుందనే చర్చ జరుగుతున్నది.
  • కాకోలీ ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో టీఎంసీ ఎంపీలు ఎన్సీపీఐలో చేరి, ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నారు. ఈ గ్రూపు నుంచి కూడా ఒకరికి కేంద్రమంత్రి పదవి దక్కే చాన్స్ ఉంది.
  • పంజాబ్‌కు చెందిన శిరోమణ అకాలీదళ్ (ఎస్‌ఏడీ) పార్టీ మళ్లీ ఎన్డీయేలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తున్నది. ఎస్‌ఏడీ లీడర్ హర్‌‌సిమ్రత్ కౌర్ బాదల్‌కు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కవచ్చని ప్రచారం జరుగుతున్నది.
  • మహారాష్ట్రలో ఎన్సీపీ (శరద్ వర్గం) తిరిగి ఎన్డీయేలో చేరే అవకాశం ఉన్నది. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేకు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని చర్చ జరుగుతున్నది.
  • మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఇప్పటికే ఎన్డీయేలో ఉన్నది. శివసేన (యూబీటీ) నుంచి ఇటీవల కొంతమంది ఎంపీలు రావడంతో షిండే వర్గం బలం 13కు చేరింది. ఈ నేథ్యంలో షిండే కుమారుడు శ్రీకాంత్ షిండేకు కేంద్ర కేబినెట్‌ చోటు దక్కనుందనే ప్రచారం జరుగుతున్నది.

14 మందిపై పని భారం

ప్రస్తుతం 14 మంది కేంద్రమంత్రులు ఒక్కటి కంటే ఎక్కువ శాఖలను చూస్తున్నారు. వాళ్లపై పనిభారం పెరిగింది. ఈ నేపథ్యంలో అదనపు శాఖలను కొత్త వాళ్లకే అప్పగించే అవకాశం ఉన్నది. ఒక్కటి కంటే ఎక్కువ శాఖలు చూస్తున్న కేంద్ర మంత్రుల జాబితాలో అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ కట్టర్, హెచ్‌డీ కుమారస్వామి, రాజీవ్ రంజన్ సింగ్, ప్రహ్లాద్ జోషి, అశ్వినీ వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, గజేంద్ర సింగ్ షెకావత్, కిరణ్ రిజిజు, మన్‌సుఖ్ మాండవీయ, జి.కిషన్ రెడ్డి.

కొందరికి రెండు పదవులు

‘ఒక వ్యక్తికి ఒకే పదవి’.. ఇది బీజేపీ సిద్ధాంతం. అటు పార్టీలో గానీ, ఇటు ప్రభుత్వంలో గానీ ఏదో ఒక్కటే పదవి ఉండాలన్నది రూల్. అయితే కొన్నిసార్లు ఈ రూల్‌ను బీజేపీ పక్కనపెడుతున్నది. ఈసారి కూడా అదే జరగనున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల జాతీయ నాయకత్వ పునర్వ్యవస్థీకరణలో స్మృతి ఇరానీ, వినోద్ తావ్డే, సతీశ్ పూనియా, తరుణ్ చుగ్‌కు పదవులు దక్కాయి. వీళ్లకు కేంద్ర మంత్రివర్గంలోనూ చోటు దక్కనున్నట్టు చర్చ జరుగుతున్నది.
గడ్కరీ వ్యాఖ్యలతో బలం

కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ ప్రచారానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చినట్లయింది. కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాల్సిన సమయం వచ్చిందంటూ ఆయన చేసిన కామెంట్లపై చర్చ మొదలైంది. మంగళవారం మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జరిగిన కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. ‘‘నేను చేయాలనుకున్నంత కాలం పని చేశాను. ప్రస్తుతం నేను మునుపటిలా పని చేయలేకపోతున్నాను. ఆ పనిని కొత్త తరాలకు అప్పగించాలి’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో గడ్కరీ రిటైర్మెంట్‌పై హింట్ ఇచ్చారా? అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఆ మాటలకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కార్యాలయం పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>