కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా సోన్ మండలం కడ్తాల్ గ్రామం (Kadthal Village) లోని అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో 44వ జాతీయ రహదారిపై భారీ వాహనాలను ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్లే మార్గంలో ఇటీవల ఓ దాబా ఏర్పాటు కావడంతో రాత్రింబవళ్లు భారీ వాహనాలు రోడ్డుపైనే నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
రోడ్డుపై వాహనాలు నిలిపివేయడంతో వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే రైతులు, గ్రామస్తులకు ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించక ప్రమాదాల ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారిపై వాహనాలు గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుండటంతో చిన్నపాటి నిర్లక్ష్యం జరిగినా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో గతంలోనే రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బ్లాక్ స్పాట్ గా గుర్తించినట్లు గ్రామస్తులు తెలిపారు. అయినప్పటికీ భారీ వాహనాల పార్కింగ్ పై శాశ్వత చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ నెల 14న ఇదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాక్ పట్ల గ్రామానికి చెందిన లక్ష్మీ నర్సయ్య మృతి చెందిన ఘటనను గ్రామస్తులు గుర్తుచేస్తున్నారు.
మరో ప్రమాదం జరిగి ప్రాణాలు పోయేలోపు అధికారులు స్పందించాలని కోరుతున్నారు. జాతీయ రహదారిపై భారీ వాహనాలను పార్కింగ్ చేయకుండా ఎన్ హెచ్ఏఐ, పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కడ్తాల్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

