కలం, వెబ్ డెస్క్: ఈతరం పిల్లలకు చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఇతర స్క్రీన్లను (Screen Time) ఎక్కువగా అందుబాటులో ఉంచుతున్నారు చాలామంది తల్లిదండ్రులు. ఇది భవిష్యత్ సామర్థ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇన్‌సెర్మ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో 502 మంది పిల్లలను పరిశీలించారు. చిన్నతనంలో స్క్రీన్ వినియోగం వల్ల తొమ్మిదేళ్ల వయసులో వారి విద్యా ప్రదర్శన, జ్ఞాపకశక్తిని విశ్లేషించారు.
పరిశోధన ప్రకారం.. ఏడాది వయసులో ఎక్కువ సమయం స్క్రీన్లను చూసిన పిల్లల్లో భవిష్యత్‌లో విద్యాపరమైన స్కిల్స్ తగ్గడం, వర్కింగ్ మెమరీ బలహీనంగా మారడం లాంటి సమస్యలను గుర్తించారు. అలాగే ఆరేళ్ల వయసులో అధిక స్క్రీన్ వినియోగం కూడా ప్రతికూల ఫలితాలతో సంబంధం ఉన్నట్లు తెలిపారు. ఎక్కువ స్క్రీన్ సమయం కారణంగా ఆటలు ఆడకపోవడం, పుస్తకాలు చదవకపోవడంతోపాటు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. ఈ కారణంగానే పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు స్టడీ తెలిపింది.
అయితే విద్యాపరమైన కంటెంట్ చూడటం, తల్లిదండ్రులతో కలిసి స్క్రీన్ వినియోగించడం మెరుగైన భాషా నైపుణ్యాలతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. పిల్లలకు స్క్రీన్ ఎంతసేపు ఇస్తున్నామన్నదే కాకుండా.. ఏ కంటెంట్ చూస్తున్నారనేది కూడా ముఖ్యమేనని నిపుణులు సూచిస్తున్నారు.

