మహాదేవ ఆగ్రో ఇండస్ట్రీస్‌లో ధాన్యం మాయం.. రూ. 6.46 కోట్ల డిఫాల్ట్!

కలం, వరంగల్ బ్యూరో: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో 2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ నిల్వల్లో భారీగా ధాన్యం మాయమైంది. కేసముద్రం మండలంలోని మహాదేవ ఆగ్రో ఇండస్ట్రీస్‌ (Mahadev Agro Industries) పై పౌరసరఫరాల శాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. డెలివరీలో డిఫాల్ట్‌కు సంబంధించి మిల్లుపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వానికి జరిగిన నష్టం రూ.6,46,89,029 కోట్లుగా నిర్ధారించారు.
రాష్ట్ర ప్రభుత్వం, పౌరసరఫరాల సంస్థ, పౌరసరఫరాల శాఖ సంయుక్తంగా చేపట్టిన ‘మిషన్‌ కే-100′ లో భాగంగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వరంగల్‌ అధికారులు, మహబూబాబాద్‌ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు మంగళవారం సంయుక్తంగా రైస్‌మిల్లులో తనిఖీ చేశారు. మిల్లుకు కేటాయించిన ధాన్యం, ఇప్పటివరకు ఇచ్చిన సీఎంర్ డెలివరీ, మిల్లులోని నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు.
2,783 టన్నుల ధాన్యం కేటాయింపు
2023-24 ఖరీఫ్‌ సీజన్‌లో మహాదేవ ఆగ్రో ఇండస్ట్రీస్‌కు మొత్తం 2,783.080 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేటాయించారు. ఇందులో 1,196.366 మెట్రిక్‌ టన్నులకు మాత్రమే సీఎంఆర్ డెలివరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన 1,586.714 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లులో అందుబాటులో ఉండాల్సి ఉంది. అయితే అధికారుల ప్రత్యక్ష తనిఖీలో మిల్లులో ఎలాంటి ధాన్యం నిల్వలు కనిపించలేదు. దీంతో 1,586.714 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు నిర్ధారించారు. మొత్తం రూ.6.46 కోట్లకు పైగా డిఫాల్ట్‌ జరిగినట్లు తేల్చారు. దీంతో కేసముద్రం పోలీస్‌ స్టేషన్‌లో మహాదేవ ఆగ్రో ఇండస్ట్రీస్‌పై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
డిఫాల్టర్లపై కొరడా
సీఎంఆర్ డెలివరీ, ప్రభుత్వానికి రావాల్సిన బకాయిల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు. ‘మిషన్‌ కే-100’లో భాగంగా డిఫాల్ట్‌కు పాల్పడిన రైస్‌మిల్లర్లపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>