కలం, వెబ్‌డెస్క్: విశాఖపట్నం (Visakhapatnam) లో ఎల్‌కేజీ స్టూడెంట్ మృతి చెందిన కేసు (LKG Student Death Case)లో టీచర్‌ను నేడు పోలీసులు అరెస్ట్ చేశారు. లిటిల్ గార్డెన్ స్కూల్‌లో ఆగస్ట్ 20న దారుణ ఘటన చేసుకుంది. హోం వర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో భయంతో ఏడుస్తూ విద్యార్థి ప్రణయ్ తేజ్ (6) క్లాస్ రూంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బాలుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ చూసి ప్రణయ్ తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బంధువులు, కుటుంబసభ్యులతో కలసి పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.
ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు బాలుడి మృతికి కారణమైన టీచర్ సుష్మను మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితురాలిని కోర్టులో హాజరుపరచగా, ఆమెకు కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన డీఈవో ఇప్పటికే సుష్మను పాఠశాల నుంచి సస్పెండ్ చేశారు. చిన్నపిల్లల పట్ల ఉపాధ్యాయులు ఇంతటి కఠినంగా వ్యవహరించడం పట్ల స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

