కలం, రామన్నపేట: గత పదేళ్లలో అర్హులైన వారికి రేషన్ కార్డులు అందలేదని, కానీ ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) స్పష్టం చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట పట్టణంలోని జీఆర్ఎం ఫంక్షన్ హాల్‌లో శనివారం నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దేశంలోనే పేదలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడ్డ నిరుపేదలకు ఇప్పుడు హక్కుగా స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తున్నామని వెల్లడించారు.
త్వరలోనే రామన్నపేట పట్టణంలోని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను కూడా కేటాయిస్తామని ఎమ్మెల్యే వేముల హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున లబ్ధిదారులు పాల్గొన్నారు.

