ఫిర్యాదుల‌పై స‌త్వ‌ర స్పంద‌న త‌ప్ప‌నిస‌రి: ఎస్పీ జానకి

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి సత్వర‌మే స్పందిస్తూ, వారి సమస్యలను పూర్తిగా విని చట్టపరమైన పరిష్కారం చూపాలని మహబూబ్‌న‌గర్ జిల్లా ఎస్పీ జానకి (SP Janaki) సూచించారు. ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించడం ద్వారా పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని ఆమె తెలిపారు. వార్షిక తనిఖీలలో భాగంగా మంగళవారం భూత్పూర్ పోలీస్ స్టేషన్‌ (Bhoothpur PS)ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించి స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు పురోగతి, సిబ్బంది పనితీరు, నేర నియంత్రణ చర్యలను సమీక్షించారు.

నేర‌స్తుల‌పై నిరంత‌ర నిఘా

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. భూత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాల తీరును, పెండింగ్ కేసులు, గ్రేవ్ కేసులు, రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు, బైండోవర్ కేసులు, వారెంట్ల అమలు, బీట్ వ్యవస్థ, నేరస్థుల కదలికలపై ఎస్పీ సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నేరాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచడంతో పాటు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భూత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ప్రతిరోజూ వేలాది భారీ వాహనాలు, ఇతర వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు. జాతీయ రహదారిపై ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా నిరంతరం నిఘా ఏర్పాటు చేసి, రద్దీ సమయాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా ట్రాఫిక్ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.

పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రేవ్ కేసుల్లో దర్యాప్తు నాణ్యతతో పాటు సాంకేతిక ఆధారాల సేకరణ, సాక్ష్యాల పరిరక్షణ, సాక్షుల వివరాల నమోదు వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. అదే విధంగా ముఖ్యమైన ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలు, రద్దీ ప్రదేశాలు, నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి పెట్రోలింగ్, బీట్ వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో గస్తీని సమర్థవంతంగా నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు.

స్టేషన్ హౌస్ ఆఫీసర్ స్టేషన్ పరిధిలోని ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తూ సమర్థవంతమైన పర్యవేక్షణ చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారం, నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో సమన్వయంతో పనిచేసి శాఖ ప్రతిష్టను మరింత పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, భూత్పూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ నాగన్న, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>