కలం, మిర్యాలగూడ : తుంగపాడు తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్‌లో విద్యార్థులతో పనులు చేయిస్తున్నారనే ఫిర్యాదులపై మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (MLA Batthula Laxma Reddy) తీవ్రంగా స్పందించారు. అందిన ఫిర్యాదుల ఆధారంగా ఆయన పాఠశాల, హాస్టల్ ప్రాంగణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా హాస్టల్, పాఠశాల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే, అక్కడి పరిస్థితులపై పాఠశాల యాజమాన్యాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పాఠశాల నిర్వాహకులకు ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీఎల్ఆర్ మాట్లాడుతూ.. ‘విద్యార్థుల విద్య, ఆరోగ్యం, మరియు భద్రతకే మా మొదటి ప్రాధాన్యత. విద్యార్థులతో ఎలాంటి పనులు చేయించినా సహించేది లేదు. వస్తున్న ఆరోపణలపై పూర్తి విచారణ జరిపి, అవి నిజమని తేలితే బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు.
విద్యార్థుల హక్కులు, సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి వసతులు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యానిదేనని ఎమ్మెల్యే ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలువురు స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

