కలం, నల్లగొండ : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు నగరం అంతటా విస్తృతంగా మొక్కలు నాటాలని నల్గొండ నగరపాలిక మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి (Nalgonda Mayor Burri Chaitanya) పిలుపునిచ్చారు. నల్గొండ – హైదరాబాద్ రోడ్డులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన ‘వన మహోత్సవం’ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ బి.వంశీకృష్ణతో కలిసి మేయర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కళాశాల ప్రాంగణంలో విద్యార్థులతో కలిసి వారు ఉత్సాహంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మేయర్ చైతన్య మాట్లాడుతూ.. కేవలం మొక్కలు నాటడంతో సరిపెట్టకుండా, ప్రతి విద్యార్థి ఒక మొక్క బాధ్యతను తీసుకొని అది పెద్ద వృక్షంగా ఎదిగే వరకు క్రమం తప్పకుండా సంరక్షించాలని సూచించారు. నగరంలో పచ్చదనం శాతాన్ని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా మున్సిపాలిటీ తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
కమిషనర్ బి. వంశీకృష్ణ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో యువత, విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. ఈ ప్లాంటేషన్ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ మహమ్మద్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, 14వ డివిజన్ కార్పొరేటర్ బొజ్జ శంకర్, 16వ డివిజన్ కార్పొరేటర్ పెరిక స్వాతి తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఈ పి. అశోక్ కుమార్, ఏఈ వి. దిలీప్ భార్గవ, నాయకులు అసీం బాబా, శానిటరీ సూపర్‌వైజర్ గడ్డం శ్రీనివాస్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ రెడ్డి, హరితహారం విభాగానికి చెందిన సిబ్బంది, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

