ఖాళీ పర్సులతో ఏఐఎస్ఎఫ్ వినూత్న నిరసన

కలం, కరీంనగర్: విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనం తప్పదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థినులకు ఇస్తామని ప్రకటించిన స్కూటీలు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్‌టాప్‌లు, రూ.5 లక్షల విద్యా భరోసా కార్డుతో పాటు పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 34 నెలలు గడిచినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం కరీంనగర్ (Karimnagar) నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద ఏఐఎస్ఎఫ్ (AISF Protest) ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. స్కూటీలు, ల్యాప్‌టాప్‌లతో పాటు ఖాళీ పర్సులను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖను ఉంచుకుని విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోవడంతో వారు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సర్టిఫికెట్ల కోసం కళాశాలలకు సొంత డబ్బులతో ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థుల పర్సులు ఖాళీ అవుతున్నాయని పేర్కొన్నారు.

స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, ‘యువ వికాసం’ పేరుతో రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు వంటి హామీలను అమలు చేయకుండా ప్రజాపాలనలో ఒక్కొక్క హామీ అమలు చేస్తున్నామని ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. విద్యార్థుల హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఓట్లతో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకుండా విద్యారంగానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని కోరారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా వాటిని అమలు చేసి విద్యార్థుల పట్ల తమ చిత్తశుద్ధిని సీఎం రేవంత్ రెడ్డి నిరూపించుకోవాలని అన్నారు. సీఎం వద్దే విద్యాశాఖ ఉన్నప్పటికీ దానికి న్యాయం చేయలేకపోతే ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఢిల్లీ తరహా ఉద్యమాన్ని తెలంగాణ గల్లీలలో నిర్వహించి విద్యార్థులను ఏకం చేస్తామని మణికంఠ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నూనావత్ శ్రీనివాస్ నాయక్, గర్ల్స్ వింగ్ నాయకురాలు జోష్ణ, నగర నాయకులు సందీప్ రెడ్డి, బోయినీ విష్ణు, అరవింద్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>