కలం, ఖమ్మం బ్యూరో: చేతిలో కనీసం సెల్ఫోన్ కూడా లేని ఒక సంక్లిష్టమైన కేసును కారేపల్లి పోలీసులు (Karepalli Police) సాంకేతిక పరిజ్ఞానంతో చాకచక్యంగా ఛేదించారు. గత మూడు నెలలుగా ఆచూకీ లేకుండా పోయిన ఓ యువతిని సురక్షితంగా కాపాడి, ఆమెను తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.
ఘటన వివరాల్లోకి వెళ్తే:
కారేపల్లి మండలం బళ్లునగర్తండాకు చెందిన ఓ యువతి గత మే నెలలో అకస్మాత్తుగా అదృశ్యమైంది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కారేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, యువతి వద్ద ఎలాంటి ఫోన్ లేకపోవడంతో సాధారణ పద్ధతుల్లో ఆమె ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు సవాలుగా మారింది.
ఈ క్రమంలో కారేపల్లి సీఐ నునావత్ సాగర్ పర్యవేక్షణలో, ఎస్ఐ బైరు గోపి దర్యాప్తు వేగవంతం చేశారు. ఫోన్ లేకపోయినప్పటికీ నిరాశచెందకుండా, లభ్యమైన కొద్దిపాటి సాంకేతిక ఆధారాలను, డేటా విశ్లేషణను ఆయుధంగా మలచుకుని విచారణను ముందుకు తీసుకెళ్లారు.విచారణలో హైదరాబాద్కి చెందిన రుకుమ్ అనే యువకుడు సదరు యువతికి పెళ్లి పేరుతో ఎరవేసి, నమ్మించి మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. లభించిన సాంకేతిక ఆధారాల సహాయంతో యువతి ఉన్న ప్రాంతాన్ని ఖచ్చితంగా గుర్తించిన పోలీసులు.. ఆమెను సురక్షితంగా విడిపించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మోసానికి పాల్పడిన నిందితుడు రుకుమ్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఫోన్ లేని క్లిష్టమైన కేసులోనూ సాంకేతికతను సమర్థంగా ఉపయోగించి 3 నెలల మిస్టరీని ఛేదించిన ఎస్ఐ బైరు గోపిని, కారేపల్లి పోలీసు బృందాన్ని స్థానికులు, ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు.

