కలం, వెబ్ డెస్క్: తెలంగాణ పోలీస్ (Telangana Police) శాఖలో పనిచేస్తున్న ఏడుగురు ఎస్పీలకు ఐపీఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పులిగిల్ల రవీందర్, బి.శ్రీ బాల దేవి, అరవింద బాబు, రాజమహేంద్ర నాయక్, బి.సాయి శ్రీ, ఐ.పూజ, పి.కరుణాకర్ నాన్ క్యాడర్ ఎస్పీలుగా కొనసాగుతుండగా వీరికి ఐపీఎస్ హోదా కల్పించింది. యూపీఎస్సీ ఈ నెల ఏడో తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించి.. తుది ఫలితాలను వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సెక్రటరీ ఉదయ్ కుమార్ గుప్తా నోటిఫికేషన్ జారీ చేశారు.
ప్రస్తుతం తెలంగాణ పోలీస్ శాఖలో 9 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉండగా.. ఏడుగురికి ఐపీఎస్ హోదా ఇవ్వడంతో పరిపాలనా భారం కొంత మేర తగ్గబోతుంది. సాధారణంగా సివిల్స్ పరీక్షల ద్వారా అభ్యర్థులకు వచ్చిన ర్యాంకు, రిజర్వేషన్ల ఆధారంగా నేరుగా ఐపీఎస్ సర్వీసులోకి యూపీఎస్సీ ప్రవేశం కల్పిస్తుంటుంది. స్టేట్ సివిల్ సర్వీస్ విభాగంలో గ్రూప్–1 ద్వారా డీఎస్పీలుగా నియామకం అయినవారికి పదోన్నతుల ద్వారా ఐపీఎస్ హోదా కల్పిస్తుంటారు.

