కలం, వెబ్‌డెస్క్: కర్ణాటకలోని (Karnataka) మాండ్యలో (Mandya) ఓ వృద్ధురాలి ఇంట్లో భారీ మొత్తంలో నగదు బయటపడిన ఘటన ఆసక్తికరంగా మారింది. మసీదు సమీపంలో భిక్షాటన చేస్తూ జీవించిన ఆ వృద్ధురాలు.. ఏళ్ల తరబడి తనకు లభించిన డబ్బును పొదుపు చేసుకున్నట్లు సమాచారం. వృద్ధురాలు మృతి చెందిన అనంతరం ఇంటిని శుభ్రం చేసేందుకు మసీదు కమిటీ సభ్యులు వెళ్లారు. ఈ సమయంలో ఇంట్లోని పలు ప్రాంతాలలో నగదుతో నిండిన గోనె సంచులు కనిపించినట్లు తెలుస్తోంది. పలుచోట్ల దాచిన ఈ నగదును చూసి కమిటీ సభ్యులు ఆశ్చర్యపోయారు.
రూ.కోటికి పైగా ఉంటుందని అంచనా
ఇంట్లో లభించిన నగదును లెక్కించే ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని తెలుస్తోంది. నగదు మొత్తం రూ.కోటికి పైగా ఉండొచ్చని సమాచారం. అయితే నగదు విలువపై అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ వెలువడలేదు. వృద్ధురాలికి భర్త, పిల్లలు ఎవరూ లేరని సమాచారం. దీంతో మసీదు కమిటీ సభ్యులు ఆమె సోదరులను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఆ డబ్బు తమకు చెందదని, దానిని మసీదుకు విరాళంగా ఇవ్వాలని వారు సూచించినట్లు సమాచారం.
జీవితాంతం పేదరికంలో భిక్షాటనపై ఆధారపడి సాధారణ జీవితం గడిపిన వృద్ధురాలి ఇంట్లో ఇంత భారీ మొత్తంలో నగదు బయటపడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఏళ్ల తరబడి భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బును ఆమె ఎలా పొదుపు చేసింది? ఇంత పెద్ద మొత్తాన్ని ఇంట్లో ఎందుకు దాచుకుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Also Read : మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌పై ఏసీబీ దాడులు
Follow Us On: X(Twitter)

