కలం, వెబ్ డెస్క్: తెలంగాణకు చెందిన అంతర్జాతీయ అథ్లెట్ తక్కడపల్లి ప్రతిభ (Athlete Pratibha) చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో క్రీడా మంత్రి తనను వేధించాడని ప్రతిభ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధిస్తే ప్రశంసించాల్సింది పోయి.. క్యూట్‌గా ఉన్నావు.. మీటవుతావా? అంటూ తనను అడిగినట్లు తెలిపారు. ఈ మేరకు ఆమె సంచలన ఆరోపణలు చేసిన వీడియోకు సంబంధించిన ప్రోమోను సదరు ఛానెల్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.
ప్రోమోలో చూస్తే.. తనను వేధించిన సదరు క్రీడా మంత్రికి తాను స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చానని తక్కడపల్లి ప్రతిభ పేర్కొన్నారు. “రెండు నిమిషాల్లో నీ బాడీలో ఏ పార్ట్ పని చేయకుండా చేస్తానని” ఆయనకు వార్నింగ్ ఇచ్చినట్లు ప్రతిభ చెప్పుకొచ్చారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రీడాకారులను ఎలా చూసుకున్నారో అర్థం చేసుకోవచ్చని ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నేతలు అంటున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారిణిని అభినందించాల్సింది పోయి వెకిలి మాటలతో వేధించడం సిగ్గుచేటని మండిపడుతున్నారు.
అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రీడా మంత్రి మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ విధులు నిర్వహించారు. తక్కడపల్లి ప్రతిభ మెడల్స్ సాధించినప్పుడు ఆయన ఆమెను ఇంటికి పిలిపించి అభినందించారు. దీంతో ప్రతిభ చేసిన తాజా వ్యాఖ్యలు శ్రీనివాస్ గౌడ్‌ను ఉద్దేశించేనని ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ ఆరోపణల నేపథ్యంలో శ్రీనివాస్ గౌడ్ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.
కాగా, కామారెడ్డి జిల్లా పిట్లం మండలానికి చెందిన తక్కడపల్లి ప్రతిభ (Athlete Pratibha) ప్రముఖ అంతర్జాతీయ అథ్లెట్, మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్. ఇటలీలో జరిగిన 5వ చెస్ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో, కోల్‌కతాలో జరిగిన ఆసియా చెస్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాలు గెలుచుకున్నారు. అలాగే జాతీయ స్థాయిలో 14 జాతీయ స్వర్ణ పతకాలను, అలాగే రెండు అంతర్జాతీయ రజత పతకాలను కూడా కైవసం చేసుకున్నారు. దేశం తరుపున ఎన్నో పతకాలు సాధించి మహిళా సాధికారతకు ఆదర్శంగా నిలిచిన ఆమె చేసిన తాజా ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
Also Read : తెలంగాణలో 121 కొత్తరకం మద్యం బ్రాండ్లు.. పేర్లు మాత్రం మాస్!
Follow Us On : WhatsApp

