కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ మద్యం (Telangana Liquor) మార్కెట్‌లోకి కొత్త బ్రాండ్లు రాబోతున్నాయి. కొత్త మద్యం బ్రాండ్ల సరఫరా కోసం 18 మంది లిక్కర్ సప్లయర్లు దరఖాస్తులు చేసుకున్నారు. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) మొత్తం 121 బ్రాండ్ల వివరాలను తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అన్ని అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకున్న సరఫరాదారులు, వారి ప్రతిపాదిత బ్రాండ్ల వివరాలను ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
విస్కీ నుంచి వైన్ వరకు..
121 బ్రాండ్లలో వివిధ రకాల మద్యం ఉత్పత్తులు ఉన్నాయి. విస్కీ, బీర్, వైన్, బ్రాందీ, జిన్, వోడ్కా, రమ్, టెకిలా, లిక్కర్ తదితర విభాగాలకు చెందిన దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లు ఇందులో ఉన్నట్లు సమాచారం. చీతా, టైగర్, రెడ్ హార్స్ అంటూ 121 కొత్త లిక్కర్ బ్రాండ్ పేర్లు తెరపైకి రావడంతో మద్యం ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ బ్రాండ్లకు సంబంధించి ఎవరికైనా అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉంటే వాటిని టీజీబీసీఎల్‌కు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. అభ్యంతరాలను సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు టీజీబీసీఎల్‌కు అందజేయాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సి. హరి కిరణ్ తెలిపారు. అభ్యంతరాలను వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా సమర్పించవచ్చని స్పష్టం చేశారు.

