కలం, తెలంగాణ బ్యూరో: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డిని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకున్నామని, ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకుంటే మరోసారి గెలిపించుకుంటామని తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం (Telangana CPS Employees) వ్యాఖ్యనించింది. సీపీఎస్ రద్దు కోసం 33 జిల్లాల్లో 41 రోజుల పాటు జాగరణ పేరుతో కార్యక్రమాలు నిర్వహించిన సంఘం.. ముగింపుగా ‘ఛలో హైదరాబాద్’ పేరుతో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బహిరంగసభ నిర్వహించించింది. జోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా.. సీపీఎస్ రద్దు అనే ఏకైక డిమాండ్‌తో నినదించారు.
సభలో సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల మందికి పైగా సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారని, వీరి కుటుంబాలన్నీ కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయని తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులకు మద్దతుగా పాత పెన్షన్ విధానంలో ఉన్న ఉద్యోగులు కూడా సభకు హాజరయ్యారని, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
4 రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు.. ఓపీఎస్ అమలు
సీపీఎస్ రద్దు డిమాండ్‌తో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అవగాహన కలిగించేందుకు జులై 11న జనజాగరణ యాత్ర మొదలైందని, 41 రోజుల పాటు 33 జిల్లాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులను కలిసి సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని కోరామని స్థితప్రజ్ఞ పేర్కొన్నారు. గడిచిన 22 సంవత్సరాలుగా సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సామాజిక భద్రత లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 5,000 మందికి పైగా సీపీఎస్ ఉద్యోగులు పదవీ విరమణ చేశారని, వారిలో ఏ ఒక్కరికీ కనీసం రూ.5,000 పెన్షన్ కూడా అందడం లేదన్నారు.
సీపీఎస్ ఉద్యోగుల ‘ప్రాన్’ ఖాతాల్లోని నిధులు మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా నష్టపోయే పరిస్థితి ఉందని, ఉద్యోగుల సొమ్ముతో పాటు ప్రభుత్వ వాటా కూడా నష్టపోయే పరిస్థితి ఉందని స్థితప్రజ్ఞ తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ (గతంలోనే), ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించిన విధంగానే తెలంగాణలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నవంబర్ 17న సామూహిక సత్యాగ్రహాలు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో తెలంగాణ కాంగ్రెస్ నవంబర్ 17న సీపీఎస్ రద్దు హామీ ఇచ్చిందని, దానికి అనుగుణంగా అమల్లోకి తేవాలని, లేనిపక్షంలో ఈ నవంబర్ 17న రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు సామూహికంగా సెలవు పెట్టి జిల్లా కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్షలు చేస్తారని స్థితప్రజ్ఞ తెలిపారు. సీపీఎస్ ఉద్యోగుల, ఉపాధ్యాయుల వృద్ధాప్య భవిష్యత్తు మొత్తం షేర్ మార్కెట్‌పై ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని, జీవితకాలం ప్రభుత్వానికి సేవ చేసిన నిధులను షేర్ మార్కెట్ దయాదాక్షిణ్యాలపై వదిలేయడం న్యాయం కాదన్నారు.
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు గతంలో తెలంగాణలో పాత పెన్షన్ విధానం పునరుద్ధరణపై చేసిన హామీలకు సంబంధించిన వీడియోలను బిగ్ స్క్రీన్‌ల మీద ప్రదర్శించారు. ‘మాకు పాత పెన్షన్ కావాలి’, ‘అది ఇచ్చేది రేవంతన్నే’ అంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నినాదాలు చేశారు.

