గోల్డ్ ట్రేడింగ్ పేరిట రూ.28 కోట్లు మోసం

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ (Zaheerabad)లో భారీ మోసం వెలుగు చూసింది. గోల్డ్, సిల్వర్ ట్రేడింగ్‌ చేస్తే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మబలికిన ‘నైకీ ట్రేడర్స్’ సంస్థ నిర్వాహకులు రూ.28 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డారు. అయితే ఈ మొత్తం విలువ రూ.వంద కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. 22 మంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూ.28 కోట్ల మోసం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్‌ కేంద్రంగా రెండేళ్లుగా నడుస్తున్న ‘నైకీ ట్రేడర్స్’ సంస్థలో జహీరాబాద్‌కు చెందిన ఎంతో మంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. మొదట్లో బాధితులకు నమ్మకం కలిగించేందుకు నిందితులు క్రమం తప్పకుండా వడ్డీ, లాభాలు చెల్లిస్తూ వస్తున్నారు. ఆ నమ్మకంతోనే బాధితులు పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చారు. తరువాత ఎలాంటి రిటర్న్స్ ఇవ్వకపోగా.. అసలు సొమ్మును కూడా తిరస్కరిస్తూ మోసానికి పాల్పడ్డారు.

ఫోన్లు చేసినా స్పందన లేకపోవడంతో..

జహీరాబాద్ పట్టణానికి చెందిన పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శశివర్ధన్ రెడ్డి, రవీంద్రబాబు, జగదీష్, సుస్మిత అనే నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జహీరాబాద్ టౌన్ సీఐ రవి తెలిపారు. నైకీ ట్రేడర్స్ మేనేజ్‌మెంట్‌పై చీటింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

తమకు లాభాలు, అధిక వడ్డీ చెల్లిస్తామని, జోయాలుక్కస్ జ్యువలరీ సంస్థకు తాము బంగారం సరఫరా చేస్తామని చెప్పి నమ్మించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది డిసెంబర్ వరకు తమతో లావాదేవీలు కొనసాగించి, తరువాత మాట్లాడటం తగ్గించారని వివరించారు. ఎన్ని సార్లు ఫోన్లు చేసినా స్పందించకపోవడంతోనే ఫిర్యాదు చేశామని, పోలీసులు తమకు న్యాయం చేయాలని ట్రేడింగ్ బాధితులు కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>