కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, సహాయకుల పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందని జిల్లా సంక్షేమాధికారి (DWO) స్వర్ణలత లెనినా వెల్లడించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, తమకు పరిచయాలు ఉన్నాయని చెప్పే దళారులను నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దని అభ్యర్థులను హెచ్చరించారు.
జిల్లా కలెక్టర్ ఛైర్మన్గా వ్యవహరించే కమిటీ ప్రభుత్వ మార్గదర్శకాలు, నిర్దేశిత అర్హతలు, రిజర్వేషన్లు, మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తుందని స్పష్టం చేశారు. ఎవరికి ఉద్యోగం వస్తుందో ముందుగా ఊహించడం సాధ్యం కాదని, ప్రలోభాలకు గురికాకుండా కేవలం అధికారిక ప్రక్రియపై మాత్రమే ఆధారపడాలని సూచించారు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వచ్చే వారంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తామని తెలిపారు.

