కలం, వెబ్‌డెస్క్: దక్షిణాఫ్రికాలో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ జోలానీ టెటే (Zolani Tete) దారుణ హత్యకు గురయ్యారు. 38 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. ఈ దారుణంపై ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. శుక్రవారం ఈ విషాద సంఘటన జరిగింది. తూర్పు కేప్‌లోని ఎమ్డాంట్సేన్లో ఉన్న తన ఇంటికి టెటే చేరుకున్నారు. కారులోనే గేటు తీసే వరకు వేచి చూస్తున్నారు. అదే సమయంలో ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు వచ్చారు. టెటేపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టెటేతో పాటు ఉన్న 27 ఏళ్ల మహిళకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.
ఆమెకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాల్పుల అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. టెటే మృతిపై దక్షిణాఫ్రికా క్రీడా శాఖ మంత్రి గేటన్ మెక్కెన్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప బాక్సర్‌ను కోల్పోయిందని ఆయన అన్నారు. జోలానీ టెటే కెరీర్ విజయవంతంగా సాగింది. ఆయన 2007లో WBF ఫ్లైవెయిట్ టైటిల్ గెలుచుకున్నారు. 2014లో IBF సూపర్-ఫ్లైవెయిట్ ఛాంపియన్‌గా నిలిచారు. ఆ తర్వాత 2017 నుంచి 2019 వరకు WBO బాంటమ్‌వెయిట్ టైటిల్‌ను నిలబెట్టుకున్నారు.
2017లో కేవలం 11 సెకన్లలోనే సిబోనిసో గోన్యాను నాకౌట్ చేసి టెటే గిన్నిస్ రికార్డు సృష్టించారు. ప్రపంచ టైటిల్ పోరులో ఇది అత్యంత వేగవంతమైన నాకౌట్. ఆయన చివరిసారిగా జూలై 2022లో లండన్‌లో జేసన్ కన్నింగ్హామ్తో తలపడ్డారు. డ్రగ్ టెస్ట్‌లో విఫలం కావడంతో ఆ ఫలితాన్ని రద్దు చేశారు. టెటే తన కెరీర్లో మొత్తం 34 ఫైట్లు ఆడారు. అందులో 29 విజయాలు నమోదు చేశారు. ఈ కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు వేగవంతం చేశారు.

