నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పూర్వదశ..! 55 ఏళ్ల చరిత్రలో రికార్డ్ ప్రవేశాలు

కలం, నిర్మల్ : ఒకప్పుడు విద్యార్థుల కొరతతో బోసిపోయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల.. నేడు విద్యార్థులతో కళకళలాడుతోంది. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనూ విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Nirmal Govt Degree College)లో ఈ ఏడాది ప్రవేశాలు జోరందుకోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. కళాశాల ప్రారంభమైన 55 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా మొదటి సంవత్సరంలో అన్ని గ్రూపులు కలిపి 718 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందడం విశేషంగా మారింది.

ఒకప్పుడు వెలవెల.. నేడు విద్యార్థులతో సందడి

నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను 1971లో ప్రారంభించారు. అప్పట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల ప్రాంతాల్లో మాత్రమే డిగ్రీ కళాశాలలు ఉండేవి. కాలక్రమేణా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు పెద్ద సంఖ్యలో ఏర్పడ్డాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్‌ లు అందించడంతో విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపారు.

దీంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు తగ్గుతూ వచ్చాయి. కొన్ని సందర్భాల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో కళాశాలలు వెలవెలబోయేవి. అయితే ప్రస్తుతం పరిస్థితి మారుతోంది. ప్రైవేట్ కళాశాలల్లో ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్‌ లు సకాలంలో అందకపోవడంతో యాజమాన్యాలు కొత్త ప్రవేశాలపై ఆసక్తి చూపడం లేదు. దీంతో విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల వైపు మొగ్గు చూపుతున్నారు.

55 ఏళ్ల చరిత్రలో రికార్డు ప్రవేశాలు..

నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరానికి అన్ని గ్రూపులు కలిపి 718 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. కళాశాల చరిత్రలో ఇంత భారీ సంఖ్యలో ప్రవేశాలు పొందడం ఇదే తొలిసారి అని కళాశాల అధ్యాపకులు చెబుతున్నారు. కళాశాలలో బీఏ (తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియం), బీఎస్సీ (జెడ్సీ) (తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియం), బీకాం (ఇంగ్లిష్ మీడియం), బీఎస్సీ (ఎంపీసీఎస్) ఇంగ్లిష్ మీడియం కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది బీకాంలో బ్యాంకింగ్, ఫైనాన్స్, సెల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కోర్సును కొత్తగా ప్రవేశపెట్టారు.

ఈ కోర్సులో ఇప్పటికే 41 మంది విద్యార్థులు చేరారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కళాశాలలో అన్ని సబ్జెక్టులకు కలిపి 27 మంది అనుభవజ్ఞులైన అధ్యాపకులు పనిచేస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరో తొమ్మిది మంది అధ్యాపకులు అవసరమని ఉన్నత విద్యాశాఖకు కళాశాల యాజమాన్యం తెలిపింది. అధ్యాపకుల బోధనతో పాటు విద్యార్థులకు అందుబాటులో ఉన్న కోర్సులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు.

ఇంటర్మీడియట్ ఫలితాల అనంతరం కళాశాల అధ్యాపకులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అందుబాటులో ఉన్న కోర్సులు, విద్యా సౌకర్యాలు, ప్రవేశాల వివరాలను వివరించారు. ప్రభుత్వ కళాశాలలో చదివితే కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ ప్రచారం కూడా ప్రవేశాల పెరుగుదలకు దోహదపడిందని కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి.

‘గర్ల్స్ హాస్టల్ భవనం అప్పగించాలి’

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న బాలికల కోసం కళాశాల వెనుక భాగంలో బీసీ బాలికల హాస్టల్ భవనాన్ని నిర్మించారు. అయితే జిల్లా ఏర్పడిన అనంతరం ఆ భవనాన్ని పోలీసు ఏఆర్ హెడ్‌ క్వార్టర్స్ కు అప్పగించడంతో బాలికలు ప్రస్తుతం మేనేజ్‌మెంట్ హాస్టల్‌ లో ఉంటూ కళాశాలకు వస్తున్నారని ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. సుధాకర్ తెలిపారు. దీనివల్ల విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. హాస్టల్ భవనాన్ని తిరిగి కళాశాలకు అప్పగించి బాలికల వసతి సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ కు పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

పూర్వ వైభవం దిశగా అడుగులు..

కళాశాల ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు మొదటి సంవత్సరంలో 718 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందడం ఆనందంగా ఉందని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.సుధాకర్ తెలిపారు. అధ్యాపకులు సమష్టిగా కృషి చేయడం, విద్యార్థులకు కళాశాలలోని కోర్సులపై అవగాహన కల్పించడం వల్లే ఈ స్థాయిలో ప్రవేశాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మళ్లీ పూర్వ వైభవం వస్తుండటం సంతోషంగా ఉందన్నారు. కళాశాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, అదనపు అధ్యాపకుల నియామకం, బాలికల హాస్టల్ భవనం సమస్యను అధికారులు పరిష్కరించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>